Jul 10,2023 21:10

సమీక్ష నిర్వహిస్తున్న మున్సిపల్‌ అధికారులు

           ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌   నగరపాలక సంస్థ పరిధిలో క్లాప్‌ కలెక్షన్లు పెంచాల్సిందేనని హెల్తాఫీసర్‌ గంగాధర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం నగరంలోని రెవెన్యూ విభాగంలో క్లాప్‌ కలెక్షన్స్‌, పారిశుధ్య పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే కలెక్షన్లపై సమీక్ష నిర్వహిస్తూ మీకు నోడల్‌ ఆఫీసర్లు ఎరు.. అంటూ సచివాలయ శానిటరీ ఇన్స్‌పెక్టర్లను కమిషనర్‌ భాగ్యలక్ష్మిని ప్రశ్నించగా మౌనమే సమాధానమైంది. ఈదశలో హెల్తాఫీసర్‌ గంగాధర్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య పనులు అధ్వానంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా శానిటరీ ఇన్స్‌పెక్టర్ల పర్యవేక్షణ కొరబడిందన్నారు. సచివాలయ శానిటరీ ఇన్స్‌పెక్టర్లు ఫీల్డ్‌లో ఉన్నట్టు కేవలం ఫొటోలు మాత్రమే తీసుకుని అప్లోడ్‌ చేస్తున్నారు తప్ప పనులు చేయడం లేదన్నారు. నగరంలో క్లాప్‌ కలెక్షన్స్‌ పెంచి తీరాల్సిందేనన్నారు. బదిలీపై వెళ్తున్న వారు కచ్చితంగా బకాయిల వసూలు చేసిన తర్వాతనే రిలీవ్‌ చేస్తానని స్పష్టం చేశారు. కమలానగర్‌ నుంచి రోజూ టన్నుల కొద్దీ చెత్త తరలిస్తుంటే, వాణిజ్య సముదాయాలు, అపార్టుమెంట్ల నుంచి చెత్త పన్ను వసూలు చేయడానికి ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు.