Jul 06,2022 23:35

నిరసన తెలుపుతున్న కళాకారులు (ఫైల్‌ఫొటో)

గుర్తింపు కార్డులకు నోచుకొని వైనం
పెన్షనూ.. గగనమే..
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

డప్పు కళాకారులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వీరు తరతరాలుగా డప్పును నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఎక్కడ ఎవరు చనిపోయినా... రాజకీయ ఊరేగింపులు, జాతరలు, ఇతర పండుగల్లో వీరి డప్పు మోగందే సందడి కనిపించదు. చదువుకున్న యువకుల కూడా ఇదే వృత్తిలో డప్పులు వాయిస్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.
డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు, వృద్ద కళాకారులకు పెన్షన్లు ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారులు సంఘం నిర్వహించిన సుదీర్ఘ ఫోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం 50 సంవత్సరలు పైబడిన డప్పు వాయిస్తున్న వృత్తిలో కొనసాగుతున్న వారికి పెన్షన్‌ ఇచ్చే జీవో జారీ చేసింది. ప్రభుత్వ జీవో ప్రకారం నెలకు రూ. 3వేలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఆరు వేల మంది పెన్షన్‌పొందుతున్నారు. జిల్లాలో అనేక మంది అర్హత ఉన్నా మండల స్థాయిలో మండల తహశీల్దారు, కలెక్టరేట్‌లో దృవికరించి గుర్తింపు కార్డులు జారీచేయడంతో నిర్లక్ష్యం వహిస్తుండటంతో పెన్షన్‌ పొందలేక పోతున్నారు. ఇలా జిల్లాలో అర్హత కలిగి గుర్తింపు కార్డుల కోసం దాదాపు మూడువేల మంది గుర్తింపు కార్డుల కోసం వేచిచూస్తున్నారు.
పెన్షన్‌ గగనమే..
అర్హత ఉన్న డప్పుకళాకారులు చిత్తూరు జిల్లాలోని 31 మండలాల్లో సుమారు 10వేల మంది ఉన్నట్లు సమాచారం, వీరిలో 50 ఏండ్లు దాటిన వారు 4 వేల మందికి పైగా ఉన్నారు. సామాజిక పెన్షన్‌ పెందడం గగనంగా మారుతోంది. ముందుగా తహశీల్దార్‌ వద్ద అర్జీలు సంతకాలు, కలెక్టరేట్‌లోని పౌరతసంబంధాలశాఖ అధికారులను ఆశ్రయించినా నెలనెల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. గత ఏడాదిలో చిత్తూరు జిల్లాలో మూడు వేల మంది డప్పు కళాకారులు పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నేటికీ పెండింగ్‌లో ఉందడా కరోనా... ఇతర సాకులతో జాప్యం చేస్తున్నారు. వెరిఫికేషన్‌ పేరుతో కొన్ని దరఖాస్తులను తిరిగీ తహశీల్దార్‌ కార్యాలయలకు పంపుతుండటంతో అర్హత ఉన్న పెన్షన్‌ కోసం వృద్ద డప్పు కళాకారులు నెలల తరబడీ వేచి చూడాల్సి వస్తోంది.
పెన్షన్‌ ఇస్తున్నాం డప్పు కొట్టండి..
అష్టకష్టాలు పడి డప్పు కళాకారులు పెన్షన్‌ పొందితే కొన్ని గ్రామాల్లో అధికారపార్టీ నేతలు, అగ్రకుల పెత్తందార్లు ఉచితంగా డప్పులు వాయించాలంటూ హుకుం జారీ చేస్తూ డప్పు కళాకారులపై ఒత్తిడి తెస్తున్నట్లు డప్పు కళాకారలు వాపోతున్నారు. తమ ప్రభుత్వం పెన్షన్‌ ఇస్తోందంటూ ఉచితంగా వాయించాలని లేకుంటే పెన్షన్‌ ఆపేస్తామంటూ అధికారపార్టీ ఊరేగింపులు, పుట్టిన రోజులు, ఇతర ఉత్సవాల్లో డప్పు కళారులకు డబ్బుల్వికుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. ఇలా బంగారుపాళ్యం, యాదమరి, బైరెడ్డిపల్లి, వికోట మండలాల్లో అధికంగా ఉంటోంది. మరో వైపు పంచాయతీలు, పట్టణాల్లో మారుమూల ప్రాంతాల్లో దండోరా వేసేందుకు పదో పరకో ఇచ్చే వారు అయితే డప్పు కళాకారులకు పెన్షన్‌ మంజురు కావడంతో పెన్షన్‌ పొందుతున్న డప్పు కళాకారులకు ఏమి ఇవ్వకుండా ఉచితంగా డప్పులు వాయించాలంటూ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఒత్తిడి చేస్తూన్నారు.
అర్హులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి
అర్హులైన ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు మంజురు చేయాలి, అలాగే 50 సంవత్సరాలు నిండిన కళాకారులకు పెన్షన్‌ మంజురు చేయాలి. ఉచితంగా డప్పులు వాయించాలంటూ ఒత్తిడి తెస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. డప్పు కళాకారులకు ఉచితంగా డ్రస్‌, గజ్జలు ఇవాల్విని ప్రభుత్వ జీవో ఉన్న అమలుకు నోచుకోలేదు. రానున్న రోజుల్లో డప్పు కళ మరుగునపడే ప్రమాదం ఉంది. కొత్తగా నేర్చుకొనే యువకుల కోసం జిల్లా కేంద్రంలో శిక్షణాకేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. దేవాలయ కమిటిలో స్థానం కల్పించాలి. పెన్షన్‌ అర్హత 50 నుంచి 45 సంవత్సరాలకు తగ్గించాలి.
- కాంజివరం సురేంద్రన్‌,
డప్పు కళాకారులు సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు