Nov 15,2022 23:21

అంగన్వాడీ సెంటర్‌లో భోజనం చేస్తున్న గర్భిణులు, బాలింతలు

'కిట్‌' తో సంపూర్ణ ఆరోగ్యం
పేదలలో పెరుగుతున్న ఆసక్తి

ప్రజాశక్తి- చిత్తూరుప్రతినిధి:

బడుగు బలహీన వర్గాల గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంపూర్ణ ఆరోగ్య కిట్లు అందిస్తోంది. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ లాంటి బహత్తర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తోంది. ఈ పథకాల ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందిస్తోంది. దీంతోపాటు వైఎస్సార్‌ అమత హస్తం, మధ్యాహ్న భోజన పథకం, బాలామతం, వైఎస్సార్‌ బాల సంజీవని పథకాలు కూడా అమలవుతున్నాయి.
గర్భిణులు, బాలింతలకు చిన్నపిల్లలకు నెలలో 25 రోజులపాటు పాలు, గుడ్లు, పప్పు, కూరగాయలు, ఆకుకూరలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. ఇందులో టేక్‌ హోమ్‌ న్యూట్రిషన్‌ కిట్‌ ద్వారా నెలకు 2కిలోల మల్టీ గ్రెయిన్‌ ఆటా, అర కిలో వేరుశనగ చిక్కీ, అరకిలో రాగి పిండి, అరకిలో బెల్లం, అరకిలో ఎండు ఖర్జూరం పంపిణీ చేస్తున్నారు. అలాగే 36 నుంచి 72నెలల లోపున్న చిన్నారులకు నెలలో 25 రోజులపాటు వేడిఅన్నం, పప్పు, కూరగాయలు, ఆకుకూరలతోపాటు 200మిల్లీ లీటర్ల పాలు, 25 కోడిగుడ్లు, 50గ్రాముల బాలామతం లడ్డు తదితర పోషకాహార పదార్థాలు ఇస్తున్నారు. 7 నుంచి 36 నెలలలోపున్న చిన్నారులకు టేక్‌ హోం న్యూట్రిషన్‌ కిట్‌ కింద నెలకు 2.5కిలోల బాలామతం, 25 కోడి గుడ్లు, 5 లీటర్ల పాలు అందిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 2420 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. అందులో 1795 మెయిన్‌, 625 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 1047 అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వభవనాలలోనూ, 654 అంగన్వాడీ కేంద్రాలు అద్దెభవనాల్లోనూ, 719 అంగన్వాడీ కేంద్రాలు ఉచిత భవనాలలో ఉన్నాయి. జిల్లాలోని 2420 అంగన్వాడీ కేంద్రాల్లో 60,965 మంది వైఎస్సార్‌ సంపూర్ణ కిట్‌ పొందుతున్నారు. 7 నెలల నుంచి 3 సంవత్సరాలలోపు 30,866మంది పిల్లలు, 23,872 మంది గర్భిణులు, బాలింతలకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషన్‌ కిట్‌ అందిస్తున్నారు. కమ్యూనిటీ బెస్ట్‌ ఈవెంట్స్‌ పోషణాభియాన్‌లో భాగంగా గర్భిణులు, బాలింతలకు పోషణవిలువలను పెంపొందించుటలో అవగాహన కార్యక్రమాలు, శ్రీమంతాలు, అన్నప్రాసన వంటి కార్యక్రమాలపై గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నారు.
సమగ్ర బాలల పరిరక్షణ..
ఈపథకం ద్వారా 0 నుంచి 8 సంవత్సరాలలోపు ఉన్న బాలబాలికలకు రక్షణ, సంరక్షణ కల్పించ బడుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు 10 బాల్యవివాహాలను అడ్డుకున్నారు. ఫోక్స్‌ చట్టం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 42 కేసులు నమోదు చేశారు.
సంపూర్ణ ఆరోగ్యానికి - పోషన్‌ కిట్‌..
- ఆర్‌.నూసరత్‌, గర్భిణీ
గర్భం దాల్చిన సమయంలో నాలుగు నెలల ముందు అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకున్నాను. నమోదు నాటికి నాకు రక్తం 8.5శాతం ఉండేది. అంగన్వాడీ కార్యకర్తలు పేరు నమోదు చేసుకున్న తరువాత ప్రతినెలా వైఎస్సార్‌ సంపూర్ణ పోషన్‌ కిట్స్‌ ఇంటికి సరఫరా చేసిన వస్తువులు ఏవిధంగా వాడుకోవాలని సంపూర్ణంగా అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకున్న గర్భవతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రభుత్వం సరఫరా చేసిన వస్తువులు వినియోగించడం వల్ల ఐదు నెలల తర్వాత 10.5 శాతం హిమోగ్లోబిన్‌ పెరిగింది.
పేదల ఆరోగ్యానికి కిట్స్‌..
- ప్రసన్న, బాలింత
నేను మొదటిసారిగా గర్భం దాల్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రంలో నా పేరు నమోదు చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు మధ్యాహ్నం అంగన్వాడీ కేంద్రంలో కోడిగుడ్డు, ఆకుకూరలు, కూరగాయలతో చేసిన భోజన పెట్టేవారు. అలాగే ప్రతినెలా వైఎస్సార్‌ పోషన్‌ కిటును ఇవ్వడంతో నా మొదటి కాన్పు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగింది. తల్లీబిడ్డ ఇద్దరం క్షేమంగా ఉన్నాం. మాపాపను గత సంవత్సరం నుండి అంగన్వాడీ కేంద్రానికి పంపుతున్నామని, 5.2 కేజీల బరువు, 62 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న హర్షిత 3 సంవత్సరాల అమ్మాయి ఆరు నెలల నుండి ఫ్రీస్కూల్‌కు పంపడం వల్ల ప్రతి రోజు 9.30 గంటలకు పాలు, 10.30గంటలకు గుడ్డు, మధ్యాహ్న భోజనంలో ఆకుకూరలు కూరగాయలతో కూడిన భోజనం, మధ్యాహ్నం 3 గంటలకు స్నాక్స్‌ కింద ఉడకబెట్టిన శనగలు తదితర పోషక ఆహారపదార్థాలు ఇస్తున్నారు. దీని వలన పాప వయసుకు తగ్గ బరువుతో పాటు ఆరోగ్యంగా ఉంది. నాకు నా కూతురు ఇద్దరికి అంగన్వాడీ కేంద్రంలో మంచి న్యాణ్యతమైన భోజనం చేయడంతో ఆరోగ్యంగా ఉన్నాం.