Aug 01,2023 21:41

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

          అనంతపురం కలెక్టరేట్‌ : బళ్లారి బైపాస్‌ రోడ్డులో రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న కిడ్నాప్‌, హత్యాయత్నం కేసును మంగళవారం 2వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సిఐ కే.ధరణికిషోర్‌ నిందితులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కర్నాటక రాష్ట్రం, రాయచూర్‌ జిల్లా, పూర్తిప్లి గ్రామ పంచాయతీ సర్పంచి ఎన్నిక విషయంలో కిడ్నాప్‌, హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. నిందితులు డి.హీరేహాల్‌ మీదుగా బెంగళూరు వెళ్తుండగా ఓబుళాపురం చెక్‌పోస్టు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులు ప్రభాకర్‌, హనుమదాసు రాజు, ప్రశాంత్‌ వెంకటేష్‌, రవికుమార్‌, సంజరు, సతీష్‌కుమార్‌, మహేష్‌ను కోర్టుకు హాజరు పరచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కిడ్నాప్‌ కేసును ఛేదించిన సిఐ ధరణికిషోర్‌, సిసిఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ జిటి.నాయుడు, ఎస్‌ఐలు సుధాకర్‌యాదవ్‌, శ్రీకాంత్‌, సిబ్బందిని ఎస్పీ కె.శ్రీనివాసరావు అభినందించారు.