Jul 13,2023 08:50

ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మేధావులు, పుర ప్రముఖులు

         అనంతపురం కలెక్టరేట్‌ : 'వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి- కేరళ ప్రభుత్వ నమూనా' అన్న అంశంపై సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం అనంతపురం జిల్లా పరిషత్‌ సమావేశం హాలులో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నల్లప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఎంఎ.బేబి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా పలువురు ఎంఎ.బేబిని కేరళ అభివృద్ధిపై పలు ప్రశ్నలు వేశారు. ఇందుకు ఆయన సమాధానం ఇచ్చారు.
కేరళ రాష్ట్రంలో కూడా అసమానతలు ఉన్నాయి.? ఎందుకు.?
మానవ హక్కుల వేదిక చంద్రశేఖర్‌

దేశంలో పోలిస్తే కేరళలో అసమానతలు చాలా తక్కువ. అయినప్పటికీ వాటిని కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ పాలనలో ప్రజలను కూడా భాగస్వామ్యులను చేస్తున్నాం. కమిటీలు వేసి ప్రజలకు ఏమి కావాలో, ఏమి చేస్తే బాగుంటుందో వారి ఆలోచనలు సేకరించి అసమానతలు రూపుమాపడానికి చర్యలు తీసుకుంటున్నాం.
సిపిఎస్‌ రద్దును కేరళ ప్రభుత్వం అమలు చేస్తుందా.?
యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు లింగమయ్య

సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయడానికి దేశంలో అనేక రాష్ట్రాలు నిర్ణయించాయి. అందులో కేరళ కూడా ఉంది. అయితే అమలు చేయడానికి ప్రయోగాత్మక సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమించి ఉద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
కేరళ ప్రభుత్వం ఎన్నికైన రెండు ఏళ్లకే కూల్చివేశారు.? ఎందుకు.?
విద్వాన్‌ విశ్వం విజ్ఞాన కేంద్రం కన్వీనర్‌ ఎజి.రాజమోహన్‌

దేశాన్ని కాంగ్రెస్‌ అత్యధిక కాలం పరిపాలన చేసింది. ఆ తరువాత బిజెపి ప్రభుత్వం పరిపాలన చేశాయి. ఆ మేరకే ఆయా రాష్ట్రాల్లో ఆపార్టీ ప్రభుత్వాల ఏర్పాటుకే పని చేశాయి. ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టుల ప్రభుత్వం కేరళలో ఏర్పాటైంది. కమ్యూనిస్టు పార్టీ లేకుండా చేయడానికి సిఐఎ కుట్ర చేసి కూల్చి వేసేలా చేశాయి. ఇండియన్‌ అంబాజిటర్‌ తన పుస్తకం రాయడంతో బహిర్గతమైంది.
కేరళలో కూడా రైతులు ఆత్మహత్యలు జరగుతున్నాయి.?
ప్రజా సంఘాల నాయకుడు హరి

కేరళ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వ పథకాలే. కొన్ని పంటలకు కేంద్ర పథకాలు అనుసంధానంగా ఉంటాయి. పండించిన పంటలను కొనుగోలు చేయకపోవడం, రాష్ట్ర రైతుల పంటలను కాదని ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడం వంటి మార్కెట్‌ సమస్యలు తలెత్తి ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు ఆత్మహత్యలు చాలా తక్కువ శాతమే జరుగుతున్నాయి. వాటిపై కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కలిగిస్తోంది.