Jul 27,2022 22:01

కేంద్రంలోని మోడీ ప్రభుత్వ
కార్మిక వ్యతిరేక విధానాలను ఆపాలి
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య
ప్రజాశక్తి- బంగారుపాల్యం:
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బంగారుపాళ్యం పారిశుద్ధ్యకార్మికులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మికవ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలను మతోన్మాద విధానాలను వ్యతిరేకిస్తూ ఆగస్టు 1 నుండి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జరుగు ప్రచారంలో జిల్లాలోని కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మికచట్టాలను నాలుగు లేబర్‌ కోడ్లుగా మార్చి కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడమే కాకుండా ప్రజల మధ్య చిచ్చుపెట్టె విధంగా మతోన్మాద చర్యలకు పాల్పడుతున్నదని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పినప్పటికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్కీంవర్కర్స్‌ అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజనం తదితర కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి మోడీ ప్రభుత్వం నిరాకరిస్తున్నదని, వారికి నెలకు రూ.26000లు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మధు, పొన్మమణి, కన్నయ్య, బాబు, వివి.ప్రసాద్‌, వల్లెమ్మ, లక్షమమ్మ అల్లా బాష పలువురు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.