గుంతకల్లు : మతాల పేరుతో విద్యార్థుల మధ్య చిచ్చురేపి, విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రంలోని బిజెపి విధానాలు ఉన్నాయని విద్యార్థిలోకం ఇలాంటి వాటిని తిప్పికొట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్ పిలుపునిచ్చారు. విద్యారంగ పరిరక్షణ కోరుతూ గుంతకల్లు పట్టణంలో రెండు రోజులు పాటు జరగనున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలు మంగళవారం నాడు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలో కళాశాలల విద్యార్థులతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. భగత్ సింగ్ విగ్రహం నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం అజంతా కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 8, 9వ తేదీల్లో గుంతకల్లు వేదికగా జిల్లా ప్లీనరీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తమ పార్టీ అధికారంలోకి వేస్తే విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా గాలికి వదిలేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ అడుగులకు మడుగులు ఒత్తుతూ జగన్ రెడ్డి లోపుభుయిష్టమైన నూతన విద్యా విధానాన్ని అమలులో చేస్తున్నారన్నారు. 3,4,5 తరగతులున్న ప్రభుత్వ పాఠశాలలు మూతవేయడం కోసం కుట్ర జరుగుతోందన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గహాల్లో పేద మధ్య తరగతి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కరువయ్యాయన్నారు. మంచినీరు, నాణ్యమైన భోజనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలల నుంచి మెస్ కాస్మోటిక్ ఛార్జీలు కూడా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించి వెంటనే కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలన్నారు. ఇంటర్ కళాశాలలో తరగతులు ప్రారంభమై రెండు నెలలు గడిచినప్పటికీ పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదన్నారు. పాఠ్య పుస్తకాలను ఇవ్వకపోగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పాఠ్యపుస్తకాలు ఇవ్వలేమని పత్రికా ప్రకటన చేయడం సిగ్గుచేటన్నారు. విద్య రంగ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. అవసరమైతే సిఎం కార్యాలయాన్ని ముట్టడించేందుకు విద్యార్థిలోకాన్ని సిద్ధం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఓతూరు రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు సి.రమేష్, జిల్లా నాయకులు సిద్ధప్ప, గిరి, వెంకటేష్, శివ, విజరు, చందు, సూరి, ప్రతాప్‌తో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.










