కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించండి
గాంధీ విగ్రహం వద్ద ప్రజాసంఘాల నిరసన
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజరు కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ దేశంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ప్రజలపై భారాలు పెంచుతూ మరోవైపు కార్పొరేటర్లకు రాయితీలు ఇస్తుందని విమర్శించారు. దేశంలో మహాధనవంతులు భారీగా లాభాలు గడిస్తున్నారని అన్నారు. 7లక్షల కోట్ల రూపాయలు మేరకు మోడీ ప్రభుత్వం వారికి రాయితీలు ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం కింద వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా దీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉందని విమర్శించారు. అంతేకాకుండా మతోన్మాద మోడీ ప్రభుత్వం స్వాతంత్ర కోసం తామే కషి చేశామని స్వాతంత్రం దినోత్సవం రోజు ఇంటింటి పైన జాతీయ జెండా ఆవిష్కరించమని పిలుపునివ్వడం హాస్యాస్పందంగా ఉందని అన్నారు. అసలు స్వాతంత్య్రం గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. బ్రిటిష్ వారికి అనుకూలంగా వ్యవహరించిన ఆర్‌ఎస్‌ఎస్ సంస్థ నేడు దేశభక్తులాగా గొప్పలు చెబుతోందని ధ్వజమెత్తారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షకార్యదర్శులు వాడ గంగరాజు, పి.చైతన్య మాట్లాడుతూ 8న క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా పోరాట స్ఫూర్తితో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈనెల11వ తేదీ మండల కేంద్రాల్లో స్కూటర్ ర్యాలీలు నిర్వహించి, 14న జరిగే జనజాగరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఆగస్టు 15న ప్రజాసంఘాల కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేసి రాజ్యాంగ పఠనంను ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం సిఐటియు జిల్లా నాయకులు గిరిధర్ గుప్తా, భువనేశ్వరి, షకీలా, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.










