Apr 06,2023 21:42

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు రాంభూపాల్‌, జాఫర్‌

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌      కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, నిరంకుశ పాలనను ఐక్యంగా పోరాడి ఎండగడదామని సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు వి.రాంభూపాల్‌, సి.జాఫర్‌ పిలుపునిచ్చారు. గురువారం గణేనాయక్‌ భవన్‌లో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజను సమస్యల్లో నెట్టి వేస్తోందన్నారు. బిజెపి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజలకు తెలియజేసి చైతన్యం తీసుకొచ్చేందుకు ఈనెల 14వ తేది నుంచి 30వ తేది వరకు రాజకీయ ప్రచార యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సిపిఎం, సిపిఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన జిల్లా, మండల, గ్రామాల స్థాయిలో అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, అక్కడే సభలు నిర్వహించి మోడీ విధానాలను ఎండగడతామన్నారు. అందులో భాగంగా జిల్లాలో కూడా 14వ తేది నుంచి రాజకీయ ప్రచారయాత్రలు చేపడుతున్నట్లు తెలిపారు. 15వ తేది బుక్కరాయసముద్రం మండలం, జంతలూరు గ్రామంలో శంకుస్థాపన చేసిన కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి అనంతపురం వరకు పాదయాత్ర, గుంతకల్‌ రైల్వేజోన్‌ కోసం పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని మండలాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రచారయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోడీ ప్రభుత్వం విధానాలు పెను ప్రమాదకరంగా మారుతున్నాయని తెలిపారు. ఆర్థిక అసమానతలు పెరిగాయన్నారు. రాష్ట్ర విభజన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు అధ్యాపకులు, సిబ్బందిని నియమించలేదన్నారు. కనీసం ప్రహరీ కూడా నిర్మించని పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్థినులకు హాస్టల్‌ వసతి లేదన్నారు. జిల్లాలో ఏర్పాటు చేస్తామన్న నాసన్‌, బెల్‌ సంస్థలు ఏర్పాటు చేయలేదన్నారు. గుంతకల్‌ రైల్వే జోన్‌ ఏర్పాటు చేయలేదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరిస్తోందన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ మతతత్వ రాజకీయ విధానాలతో దేశ ఐక్యతకు విఘాతం ఏర్పడిందన్నారు. న్యాయ వ్యవస్థను తమ ఆధీనంలో పెట్టుకుని రాజ్యాంగ వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనే విధానాలు అమలు చేస్తోందన్నారు. ఇలాంటివి సమాజంలో మంచిది కాదన్నారు. దీన్ని అందరూ వ్యతిరేకించాలన్నారు. ప్రశ్నించాల్సిన అధికార, ప్రధాన ప్రతిపక్షాలు మోడీకి పొర్లు దండాలు పెడుతూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని విమర్శించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్‌ మాట్లాడుతూ మోడీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. విదేశాల్లో దాచుకున్న నల్లధనం దేశానికి తీసుకొచ్చి పేదలకు పంచిపెడతామని మాటలకే పరిమితం అయ్యారని తెలిపారు. నోట్లు రద్దుచేసి ప్రజలకు మంచి రోజులు వస్తాయని నమ్మించారని, అదానీ, అంబానీ వంటి ధనవంతులకు మంచి రోజులు వచ్చాయని విమర్శించారు. 9 ఏళ్ల మోడీ పాలనలో నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. అదానీ ఢొల్ల కంపెనీలతో ఆర్థిక నేరానికి పాల్పడ్డారని చెబుతున్నా స్పందన లేదన్నారు. జెపిసి కమిటీ వేయమంటే వేయడం లేదన్నారు. ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు కూడా లేకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారని, రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వం రద్దే ఇందుకు నిదర్శనం అన్నారు. పోలవరం ప్రాజెకును కేంద్ర ఫ్రభుత్వం పూర్తి చేయాల్సి ఉందన్నారు. కానీ ఇస్తామన్న నిధులు కూడా ఇవ్వలేదన్నారు. కర్ణాటకలో మాత్రం అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ. 5,390 కోట్లు కేటాయించారని తెలిపారు. ప్రశ్నించాల్సిన వైసిపి ప్రభుత్వం, సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మోడీకి మోకరిల్లుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదన్నారు. మోడీ, జగన్‌ విధానాలను ప్రజలకు తెలియజేసేందుకు 14వ తేది నుంచి 30వ తేది వరకు ప్రచారయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు పి.నారాయణస్వామి, మల్లికార్జున, సిపిఎం నగర కార్యదర్శులు వి.రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు, సిపిఎం నాయకులు ముస్కిన్‌, వెంకటనారాయణ, సిపిఐ నాయకులు రమేష్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, ఎఐఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.