ప్రజాశక్తి - భీమవరం
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రతి ఒక్కరూ గొంతెత్తి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ పాలనను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందని ఉమ్మడి కమ్యూనిస్టుల రాజకీయ ప్రచార భేరి పిలుపునిచ్చింది. మోడీ, అమిత్‌షా నాయకత్వంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కూటమి అన్నదమ్ముల కలిసిమెలిసి ఉంటున్న ప్రజల మధ్య మతవిధ్వేషాలు రెచ్చగొడుతోందని, రాబోయే రోజుల్లో బిజెపిని సాగనంపి, దేశాన్ని కాపాడుకోవాలని రాజకీయ ప్రచార భేరి బహిరంగ సభ ప్రతిభ బూనింది.
సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకూ చేపట్టిన రాజకీయ ప్రచార భీరి భీమవరంలో శుక్రవారం ప్రారంభమైంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సిపిఐ, సిపిఎం నేతలు పూలమాల వేసి నివాళులర్పించి రాజకీయ ప్రచార భేరిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాశం చౌక్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.వాసుదేవరావు, సిపిఐ జిల్లా సమితి నాయకులు చల్లబోయిన రంగారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు భీమారావు, బి.బలరాం మాట్లాడారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే ప్రజాస్వామ్యానికి మనుగడ అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా దేశ ప్రజల సమస్యలు నేటికీ అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. నిత్యం పెరుగుతున్న ధరలతో ప్రజలు విసిగిపోయారన్నారు. మరోవైపు కార్మికుల, రైతుల, వ్యవసాయ కార్మికుల, సామాన్య మధ్యతరగతి ఉద్యోగుల, ప్రజల హక్కుల్ని కాలరాసేలా చట్టాలు తీసుకొస్తోందని విమర్శించారు. కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కి కార్పొరేట్లకు అనుకూలమైన లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. వ్యవసాయ రంగాన్ని ఉరితీసేలా నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారని విమర్శించారు. రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యుత్ చట్టాన్ని సవరించి విద్యుత్ బిల్లును తీసువచ్చారన్నారని తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరిని బిగిస్తున్నారన్నారు. దేశ ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో పడిపోయిందన్నారు. ప్రజలు ఎలా జీవించాలో, ఏ తిండి తినాలో, ఏ బట్ట కట్టాలో, ఏ బాషా మాట్లాడాలో కూడా బిజెపి నేతలే చెప్పడం అంటే అంత కన్నా సిగ్గుచేటు ఇంకొకటి లేదన్నారు. దేశ ప్రజల మధ్య మత చిచ్చు రేపుతోందని విమర్శించారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొడుతూ, తన అనుకూల ప్రభుత్వాలను నెలకొల్పుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలమైన ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సేవలో మునిగిపోయిందన్నారు. నేడు దేశంలో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగం పెరగడానికి మోడీ ప్రభుత్వమే కారణమన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల జాడ లేకుండా పోయిందన్నారు. మేధావులు, అభ్యుదయ వాదులు, విద్యావంతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, మైనార్టీల మీద దాడులు, హత్యలు పెరిగాయన్నారు. దేశాన్ని అన్ని విధాలా అధోగతి పాలు చేసిన ఘనత బిజెపికే దక్కిందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ, పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు విషయాన్ని బిజెపి ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందన్నారు. విశాఖ ఉక్కును బలోపేతం చేయకుండా, ముడి సరుకును కేటాయించకుండా నష్టాలు వస్తున్నాయనే సాకు చూపి కార్పొరేట్లకు అప్పగించేందుకు పూనుకుందన్నారు. అయినా ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదన్నారు. టిడిపి కేంద్రం చేస్తోన్న అన్యాయంపై కనీసం మాట్లాడడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఆందోళన చేస్తోన్న టిడిపి కేంద్రం చేస్తోన్న అన్యాయాలపై మిన్నకుండిపోవడం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినట్టే అన్నారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన జనసేన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించిందేలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై వామపక్షాలు చేస్తున్న ఆందోళనల్లో మిగిలిన పార్టీలు కూడా కలిసి రావాలని కోరారు. అనంతరం ప్రకాశంచౌక్ సెంటర్ నుండి అంబేద్కర్ చౌక్, ప్రకాశం చౌక్ మీదుగా తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో దారిపొడువునా కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.వైకుంఠరావు, జె.సత్యనారాయణ, సిపిఐ జిల్లా నాయకులు ఎం.సీతారాం ప్రసాద్, కె.వెంకట్రావు, ఎస్.పుష్పకుమారి, లక్ష్మణరావు, సిపిఎం నాయకులు చెల్లబోయిన వెంకటేశ్వరరావు, బి.చైతన్య ప్రసాద్, డి.నాగు, కె.కృష్ణ పాల్గొన్నారు.
నరసాపురం రూరల్ : ప్రజా వ్యతిరేక బిజెపిని సాగనంపి దేశాన్ని కాపాడుకుందామని సిపిఎం, సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రచార భేరి కార్యక్రమాన్ని ప్రారంభించామని వామపక్ష నేతలు కవురు పెద్దిరాజు, నెక్కంటి సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సభ నిర్వహించారు ఈ సభకు సిపిఎం పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు అధ్యక్షత వహించారు. అనంతరం కవురు పెద్దిరాజు, నెక్కంటి సుబ్బారావు మాట్లాడారు. సభ అనంతరం పట్టణంలోని ప్రముఖ కోడళ్లలో ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తెలగంశెట్టి సత్యనారాయణ, జె.రామ్మోహన్‌రావు, పొన్నాడ రాము, బూడిద జోగేశ్వరరావు, పొగాకు నారాయణరావు, రామలింగం, కోడి లక్ష్మణ్, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
యలమంచిలి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకూ ప్రజాతంత్ర వాదులంతా కలిసి రావాలని సిపిఎం మండల కార్యదర్శి కానేటి బాలరాజు పిలుపునిచ్చారు. సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 14 తేదీ నుండి 20వ తేదీ వరకూ మండల వ్యాప్తంగా సిపిఎం ప్రచార భేరి కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు భారతి రెడ్డి జార్జి, దేవ సుధాకర్, మాసవరపు సుబ్బారావు, గొల్ల ఏడుకొండల శ్రీనివాస్, ఎం.ఆంజనేయులు, ఎస్.భాస్కరరావు, టి.స్టాలిన్, చిట్టిబాబు, కె.వెంకటేశ్వరరావు, ఎం.రాజేష్ పాల్గొన్నారు.
ఆకివీడు : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం ప్రారంభించిన ఇంటింటా ప్రచార భేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి గోపాలన్ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద జరిగిన ప్రచార భేరి ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం అక్కడి నుండి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ విగ్రహం సాగింది. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ప్రచార భేరి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి కె.తవిటినాయుడు, పెంకి అప్పారావు, నాయకులు పాల్గొన్నారు.
తణుకురూరల్ : భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని సిపిఎం, సిసిఐ పట్టణ కార్యదర్శులు పివి ప్రతాప్, బొద్దాని నాగరాజు అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎన్‌టిఆర్ పార్కు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రచార భేరిని ప్రారంభించి అరుంధతి పేటలో ప్రచార కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గార రంగారావు, కామన మునిస్వామి, వీర్రాజు, శింగులూరి సత్యనారాయణ, సిపిఐ బొద్దాని మురళి పాల్గొన్నారు.
పెనుమంట్ర : బిజెపి ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రచార భేరి కార్యక్రమం పెనుమంట్రలో సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభమైంది. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకుడు ఆకుల హరే రామ్, మండల కార్యదర్శి కూసంపూడి సుబ్బరాజు, మండల కమిటీ సభ్యులు చింతపల్లి లక్ష్మికుమారి, కేతా.పద్మజ, కోడే శ్రీనివాస్‌ప్రసాద్, బి.విజయకుమార్, కంజు వెంకటేశ్వరరావు, గంటి ఆంజనేయులు, కొప్పిశెట్టి హేమంత్, కె.హనుమంతు పాల్గొన్నారు.
అత్తిలి : వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త ప్రచార భేరి కార్యక్రమం మండలంలో మంచిలి గ్రామంలో శుక్రవారం ప్రారంభమైంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్, నేతలు ఎం.ఆంజనేయులు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచిలిలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంచుతూ కేంద్ర ప్రభుత్వం వైఖరిని వివరించారు. ఆయా పేటల్లో జరిగిన సభలలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అరాచక పాలనను ప్రజలు ఇక ఎంత మాత్రమూ సహించబోరని తెలిపారు. కార్యక్రమంలో దొంగ సాంబమూర్తి, కె.ధర్మేంద్ర, బొట అప్పారావు, మాండ్రు మాక సురేష్, కేతా నరసింహమూర్తి, కనకం, పి.సత్యనారాయణ పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : బిజెపి ప్రజావ్యతిరేక, మతోన్మాద విధానాల నుంచి దేశాన్ని కాపాడుకుందామని సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ నెల 14 నుండి 21వ తేదీ వరకూ వామపక్షాల ఆధ్వర్యంలో జరిగే ప్రచార భేరి కార్యక్రమాన్ని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రధాని మోడీ దేశాన్ని కార్పొరేట్లకు కారు చౌకగా కట్టబెడుతున్నారని విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు. ప్రచార భేరిలో పట్టణ ప్రజలంతా పాల్గొని బిజెపి ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరెడ్ల రామకృష్ణ, జవ్వాది శ్రీను, శిద్దిరెడ్డి శేషుబాబు, మడకా రాజు, పోతు శ్రీను, అల్లం రాము, దాస్యం రాము పాల్గొన్నారు.
ఉండి : మతతత్వ పార్టీ నుంచి దేశాన్ని కాపాడాలని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని రైతులు, కార్మికులు, ప్రజలకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి గోపాలన్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా చెరుకువాడలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రచార భేరిని ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ వరకూ సిపిఎం ప్రచార భేరి నిర్వహించి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేలా కరపత్రాలను పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ధనికొండ శ్రీనివాస్, నాయకులు చీరల శేషు, చీరల శ్రీనివాస్, నిమ్మితి కిషోర్, కొట్టాడ వెంకటేశ్వరరావు, రామకూరి వెంకటరత్నం పాల్గొన్నారు.
పెనుగొండ : వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార భేరి కార్యక్రమం పెనుగొండలో శుక్రవారం ప్రారంభమైంది. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రచార భేరి కార్యక్రమాన్ని నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు షేక్ పాదుషా, నాగిశెట్టి గంగారావు, బొల్లోజు నేతాజీ, రాజమహేంద్రవరపు వెంకటేష్, గెద్దాడ శ్రీను పాల్గొన్నారు.
కాళ్ల : బిజెపి నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ తెలిపారు. సిపిఎం ఆధ్వర్యంలో కొత్తపేట అంబేద్కర్ విగ్రహానికి గరికముక్కల ఆజమ్మ నివాళులర్పించి పూలమాలవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ మాట్లాడుతూ కార్యక్రమంలో మండా సూరిబాబు, తిరుమాని శ్రీను, పుచ్చకాయల వజ్రమ్మ, షాట్ల ఏసురత్నం, బాతు రామస్వామి పాల్గొన్నారు.
ఆచంట : దేశంలోని పేద ప్రజల జీవితాలను దుర్భరం చేసిన కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దేశ ప్రజలంతా తక్షణం గద్దె దించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.రాజారామ్మోహన్ రారు పిలుపునిచ్చారు. సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ప్రఛార బేరి యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆచంట పెద్దపేట, అరుంధతి పేటలో రామ్మోహన్ రారు, సిర్రా నరసింహ మూర్తులు, నేతలు అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజా రామ్మోహన్ రారు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో మోడీ ఇచ్చిన హామీ ఇంతవరకు నేరవేర్చలేదన్నారు. ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకూ చేపట్టనున్న ప్రచార భేరి యాత్రను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మోహన్, కారిపిల్లి రాజు, గుత్తుల రంగారావు, తోటపల్లి సత్యన్నారాయణ, ఇందుకూరి సూర్యనారాయణ రాజు, బొర్రా ధర్మారావు, తలుపూరి బుల్లబ్బాయి, వాసా రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.
పాలకోడేరు : మతోన్మాద బిజెపి సమాజంలో విభిన్న వర్గాల మధ్య చిచ్చు రేపుతోందని, రాబోయే ఎన్నికల్లో బిజెపిని సాగనంపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి గోపాలన్ పిలుపునిచ్చారు. శృంగవృక్షంలో ప్రచార భేరి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెంటనే ప్రకటించాలని గోపాలన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి అసిరియ్య, పళ్లెం భీమన్న, కోటికల పూడి శ్రీనివాస్, బాబ్జీ, మాజీ ఎంపిటిసి అసిరయ్య పాల్గొన్నారు.










