Jan 20,2023 20:46

కేంద్ర మతోన్మాదపాలనను గద్దెదించాలి
ప్రజాశక్తి- పలమనేరు:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ విధానాలపై రెండు రోజులు పాటు పలమనేరు వాసవి కళ్యాణ మండపంలో సిపిఎం జిల్లా కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. మొదటి రోజు శుక్రవారం ప్రారంభించి క్లాసులకు గిరిధర్‌ గుప్తా ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. రాష్ట్ర నాయకులు సుబ్బారావు, సిపిఎం జిల్లాకార్యదర్శి వాడ గంగరాజులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతోన్మాద, కార్పొరేట్‌ కూటమిగా ఉందని దీన్ని గద్దెదించేందుకు సిపిఎం కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని, ఇది శుభ పరిణామమని తెలిపారు. బీజేపీని ఓడించడమే ప్రజలు, ప్రతిపక్షాల ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. దేశాన్ని, ప్రజలను, రాజ్యాంగాన్ని, ప్రజల బతుకు తెరువును కాపాడాలంటే బీజేపీని గద్దె నుంచి దించాలని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌, ఆప్‌, వామపక్షాలు వేర్వేరు మార్గాల్లో సొంతంగా పోరాటాలు కొనసాగిస్తున్నాయని అన్నారు. 2024లో స్వేచ్చగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగితే బిజెపి ఓడిపోతుందని పేర్కొన్నారు. దేశంలో ప్రతిపౌరుడు ఇబ్బందుల్లో ఉన్నాడనీ, ప్రజలు సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారని వివరించారు. మరోవైపు ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు రాజకీయంగా దుర్వినియోగ మవుతున్నాయని, దేశ పరిస్థితుల్లో మార్పు రావాలంటే, బీజేపీని ఓడించడమే తమ ముందున్న లక్ష్యమని అన్నారు. రోడ్ల పేరు మారిస్తే బానిసత్వం, పేదరికం పోదని ఎద్దేవా చేశారు. రోడ్ల పేరు మార్చడం వల్ల ప్రజలకు ఉపయోగం లేదని, మానవ అభివృద్ధి సూచిక, ప్రజల జీవనప్రమాణల్లో భారత్‌ పరిస్థితి దిగజారిందని ఎద్దేవా చేశారు. బీజేపీకి దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడానికి ప్రైవేటీకరణ, ప్రభుత్వ ఆస్తులు అమ్మడం, వ్యవసాయ నల్లచట్టాలను తీసుకురావడం, నూతన విద్యావిధానాన్ని అమలు చేయడం, కార్మిక చట్టం రద్దు చేయడం దుర్మార్గమన్నారు. ఇలాంటి ప్రమాదకరమైన విధానాలను రాష్ట్రంలో రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలపై భారాల మోపుతున్నదన్నారు. ఈ విధానాలపై విస్తతంగా ప్రచారం చేయాలని సిపిఎం పిలుపునిస్తున్నదని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సురేంద్రన్‌, ఓబుల రాజు, భువనేశ్వరి, చిరంజీవమ్మ కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వర్‌, పార్టీ సభ్యులు వరలక్ష్మి, బాలసుబ్రమణ్యం, రాజేష్‌, శంకర్‌, జయంతి, రాజా, హైదర్‌ బాషా, జ్యోతి పాల్గొన్నారు.