Oct 11,2023 22:26

చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కేంద్ర బృందం సభ్యులు

ప్రజాశక్తి - గార, నౌపడ: కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అనుబంధ సంస్థ కేరళ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లోకల్‌ అడ్మినిస్ట్రేషన్‌ పరిశీలకులు ఈశ్వరన్‌ నంబూద్రి బృందం గార మండలం శ్రీకూర్మం, సంతబొమ్మాళి మండలంలోని సంతబొమ్మాళి పంచాయతీలు బుధవారం పరిశీలించింది. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ పనితీరు, మౌలిక సదుపాయాలు, పరిపాలన, వసతులు, నిధుల సమీకరణను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, అందిస్తున్న సేవలను పరిశీలించారు. చెత్త సంపద తయారీ కేంద్రం వద్ద నిర్వహిస్తున్న వ్యర్థాల నిర్వహణ తడి, పొడి చెత్త సేకరణ, వర్మీ కంపోస్టు తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. ఈ బృందం ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ సర్టిఫికేషన్‌ గుర్తింపునకు సిఫార్సు చేయనుంది. కార్యక్రమంలో జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్‌, జిల్లా కోఆర్డినేటర్‌ వెంకటరాజు, డివిజనల్‌ పంచాయతీ అధికారి గోపిబాల, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి ఆర్‌.సంజీవ రమణయ్య, శ్రీకూర్మం, సంతబొమ్మాళి పంచాయతీ సర్పంచ్‌లు గోరు అనిత, కళింగపట్నం లక్ష్మీఅప్పారావు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.