Feb 28,2023 21:27

సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ పూర్తిగా మోసపూరితం, ప్రజా వ్యతిరేకమని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యాన మంగళవారం స్థానిక సుందరయ్య భవనంలో సదస్సు నిర్వహించారు. పుట్టా వేణుగోపాలచౌదరి సదస్సుకు అధ్యక్షత వహించగా ముఖ్యవక్త బలరాం మాట్లాడుతూ బడ్జెట్‌ ప్రవేశపెడితే ధరలు తగ్గుతాయని ప్రజలు ఆశించారని, దానికి భిన్నంగా మోడీ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టాక ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన ద్వారా నష్టపోయిన ఎపికి ప్రత్యేక హోదా లేదని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదని, కడప ఉక్కు పరిశ్రమ సంగతి మరిచారని, విశాఖపట్నం రైల్వేజోన్‌ ఇవ్వలేదని, వెనకబడిన ప్రాంతాలకు నిధుల్లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేజోన్‌ హామీ పక్కన పెట్టారని గుర్తు చేశారు. మోడీ బడ్జెట్‌ కార్పొరేట్‌ శక్తులకు రాయితీలిచ్చేలా, పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపేలా ఉందన్నారు. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వం వ్యవసాయ సబ్సిడీలు తగ్గించడం అన్యాయమన్నారు. జిల్లా నుండి ఆక్వా ద్వారా రూ.వేల కోట్ల ఆదాయం వస్తున్నా బడ్జెట్లో జిల్లాకు ఎలాంటి నిధులూ కేటాయించలేదని విమర్శించారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన అధినాయకులు బడ్జెట్‌పై ఎలాంటి విమర్శలు చేయలేదని ఆరోపించారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచే చర్యలు బడ్జెట్‌లో లేవని వారన్నారు. పట్టణ ప్రాంతాల్లో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి హామీ పనులు చూపాలనే డిమాండ్‌ ఉన్నా నిధులు పెంచకపోగా ఉన్న నిధులు తగ్గించారని ఆందోళన వ్యక్తం చేశారు. నూటికి 64 శాతం ప్రజల నుంచి జిఎస్‌టి రూపంలో రూ.లక్షల కోట్లు వసూలు చేస్తున్న ప్రభుత్వం, కార్పొరేట్ల నుంచి కేవలం మూడుశాతం మాత్రమే పన్ను వసూలు చేస్తుందని విమర్శించారు. క్రోని క్యాపిటలిజం పేరుతో అదానీకి, అంబానీకి దేశ సంపద దోచిపెట్టే విధానాన్ని సిపిఎం వ్యతిరేకిస్తుందన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తుల సేవ మాని ప్రజలకు సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు, పట్టణ నేతలు కరెడ్ల రామకృష్ణ, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, మడక రాజు, చిటికిన రాము, జవ్వాది శ్రీను, ధనాల వెంకట్రావు, అల్లం పూర్ణిమ, గొల్లు లక్ష్మీ, వర్రి అప్పారావు, సిద్దిరెడ్డి శేషుబాబు, ధనాల దానయ్య, పోతు శ్రీను, అయినాల ధర్మారావు, అగుర్తుల రామోహనరావు, అయినాల సత్యనారాయణ పాల్గొన్నారు.