Aug 24,2022 22:28

కడుపు నింపని బొమ్మలు
అమ్ముడుపోని విగ్రహాలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

కరోనా కష్టాలు వినాయకుడిని సైతం వదలేదు... ఉత్సవాలు, ఊరేగింపులు... డప్పు చప్పుడ్లు లేక వినాయక విగ్రహాల కొనుగోలు పూర్తిగా మద్దగించడంతో వినాయక విగ్రహాల తయారీదార్లు నిండా కష్టాల్లో కూరుకుపోయారు. ఏడాది పాటు వినాయక చవతి కోసం తయారు చేసుకున్న విగ్రహాలు అమ్ముడుపోక తయారు చేసిన విగ్రహాలను ఏం చేసుకోవాల్లో అర్థంకాక బొమ్మల తయారీ వృత్తిదారులు అల్లాడుతున్నారు. కాస్తా చిన్నచిన్న విగ్రహాలు అమ్ముడు పోవడం ఊరటనిస్తున్నా.. వేల రూపాయలు ఖర్చు చేసి తయారు చేసి భారీ విగ్రహాల సంరక్షణ కష్టంగా మారుతోంది. ఈ ఏడాదైనా గిరాకీ ఉంటుందని భావించిన కరోనా నిబంధనలతో విగ్రహాల కొనుగోలుకు యువత పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో నష్టపోతున్నామని బొమ్మల తయారీదారులు చెబుతున్నారు.
చిత్తూరు పరిసర ప్రాంతాలైన రెడ్డిగుంట, యాదమరి మండలం భూమిరెడ్డిపల్లి, జీడి నెల్లూరు ప్రాంతాల్లో భారీ వినాయక విగ్రహాలతో పాటు చిన్నచిన్న ప్లాస్టాఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలను తయారు చేసే వృత్తిదారులు ఏళ్ల తరబడీ జీవనాధారంగా వినాయక విగ్రహాల తయారీపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏడాది పాటు వినాయక చవతిని దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తుంటారు. అయితే కరోనా నిబంధనలతో మూడేళ్ళుగా ఉత్సవాల నిర్వహణపై ఆంక్షలతో విగ్రహాల అమ్మకాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి వినాయక చవతికి వారం, పది రోజులకు ముందే ఏ సైజులో బొమ్మలు కావాలో ఆడ్డర్స్‌ ఇస్తుంటారు. మరో వారం రోజుల్లో వినాయక చవతి ఉంటే ఇప్పటి వరకు ఎలాంటి ఆడ్డర్స్‌ రావడం లేదు. తయారు చేసిన బొమ్మలను కూడా అమ్ముడుపోయే పరిస్థితి లేదు. తయారు చేసిన బొమ్మల సంరక్షణ భారంగా మారుతోందని బొమ్మల తయారీ వృత్తిదారులు చెబుతున్నారు. బొమ్మల సంరక్షణ కోసం వేల రూపాయులు ఖర్చు చేయాల్సి వస్తోందంటున్నారు. ఇదే పరిస్థితిఉంటే బొమ్మల తయారీ మనుకోవాల్సి వస్తుందంటున్నారు.
అమ్ముడుపోవడం లేదు..
ఏడాది పాటు తయారు చేసిన బొమ్మలను పండుగ రోజు అమ్ముకుంటే కాస్తో కూస్తో డుబ్బులు వస్తాయి. మరో వారం రోజుల్లో పండుగ ఉన్నా భారీ విగ్రహాలను కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. తయారు చేసిన వాటిని మరో ఏడాది పాటు ఉంచాలంటే రంగు వెలిసిపోవడం, దెబ్బతినే ప్రమాదముంది. కరోనా కారణంగా ఉత్సవాలపై ఆంక్షలతో మూడేళ్ళుగా ఇదే పరిస్థితి. చిన్న చిన్న విగ్రహాలను తయారీ ఖర్చులకే అమ్ముకోవాల్సి వస్తోంది.
- వెంకటేష్‌, రెడ్డిగుంట
వినాయక విగ్రహాల తయారీ వృత్తిదారుడు