Jul 31,2023 22:46

కలెక్టరేట్‌ వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు

        అనంతపురం కలెక్టరేట్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా కడపలో నిర్మించాల్సిన ఉక్కు పరిశ్రమ లాభదాయకం కాదని కేంద్రం ప్రకటించడం రాయలసీమ ప్రజలకు తీరని ద్రోహం చేయడమేనని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. కలెక్టరేట్‌ వద్దకు ర్యాలీగా వచ్చి, అక్కడ మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. కేంద్రం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈసందర్భంగా రాంభూపాల్‌ మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమ స్థాపిస్తామని ఇన్నాళ్లు రాయలసీమ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తూ వచ్చిందన్నారు. తొమ్మిది సంవత్సరాల పాలన తర్వాత అదివీలుపడదని చెప్పి సీమ ప్రజలను నట్టేట ముంచిందని విమర్శించారు. చట్ట ప్రకారం ఈ పరిశ్రమను పది సంవత్సరాల్లో పూర్తి చేయాల్సుందన్నారు. కేంద్రం ఏడు సంవత్సరాల తర్వాత పర్యావరణ అనుమతులు మంజూరు చేసి, తొమ్మిదో సంవత్సరంలో సెయిల్‌ సంస్థ చేత అధ్యయనం చేసి ఆ తరువాత సాధ్యం కాదని ప్రకటించడం దారుణమన్నారు. పరిశ్రమ మౌలిక సదుపాయల్లో భాగంగా నాలుగులైన్ల రోడ్డు, రైల్వేలైన్‌, విద్యుత్‌ సదుపాయాల్లో కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ రంగంలో సాధ్యం కాని ఉక్కు పరిశ్రమ జిందాల్‌ కంపెనీకి ఎలా లాభమవుతుందని దానికి అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ పరిశ్రమ రావడం ద్వారా రాయలసీమ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షమందికి ఉపాధి వస్తుందని ప్రభుత్వాలు చెప్పాయన్నారు. పరిశ్రమ ఏర్పాటు అయితే ఉపాధి లభిస్తుందని ఆ ప్రాంత యువత ఎదురుచూస్తున్న తరుణంలో దానిని ఏర్పాటు చేయడం లేదంటూ పార్లమెంట్‌లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరారు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వడం సీమ ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుందన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఉక్కు పరిశ్రమ వస్తుందని ఆశపెట్టి విభజన చట్టం హామీల గడువు ముగిసిన సమయంలో ఇలా ప్రకటించడం అన్యాయం అన్నారు. కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం నాలుగు సార్లు శంకుస్థాపనలు చేశారన్నారు. రాయలసీమ ప్రజలు ఎదురుచూస్తున్న కడప ఉక్కు పరిశ్రమ నిర్మించడంలో కేంద్రం తీరును కనీసం ప్రశ్నించలేని స్థితిలో రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీలు సీమ ప్రజల ఆకాంక్షను గుర్తించి కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. లేకపోతే ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కడప ఉక్కు కోసం సిపిఎం కలిసివచ్చే పార్టీలు, సంస్థలు, వ్యక్తులను కలుపుకుని భవిష్యత్‌ ఉద్యమాన్ని ఉధతం చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌ను సిపిఎం నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఓ. నల్లప్ప, ఎం. బాలరంగయ్య, నగర కార్యదర్శులు వి.రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు, జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌.నాగేంద్రకుమార్‌, రామాంజనేయులు, ముష్కిన్‌, వెంకటనారాయణ, భాస్కర్‌, నాయకులు ప్రకాష్‌, వలి, మసూద్‌, ముత్తుజా, గోపాల్‌, బాబు, రాజు, మున్నీ, లక్ష్మినర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.