అనంతపురం కలెక్టరేట్ : కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపించలేమని కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రకటించడం రాయలసీమ ప్రజలను మోసం చేయడమేనని సిపిఎం జిల్లా కమిటీ విమర్శించింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా రాయలసీమ అభివద్ధికి ప్రత్యేక నిధులు, కడపలో ఉక్కు పరిశ్రమ, కేంద్రీయ విశ్వవిద్యాలయం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు స్థాపించాల్సి ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా వీటిని అమలు చేయకుండా తీరని ద్రోహం చేసిందన్నారు. గతంలో రాష్ట్ర బిజెపి ప్రకటించుకున్న రాయలసీమ డిక్లరేషన్‌కు కట్టుబడి ఉన్నామని ఆ పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షురాలు ప్రకటించిన మూడు రోజులకే కేంద్ర బిజెపి ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ స్థాపించలేమని చెప్పడం ఆ పార్టీ నయవంచన విధానాలకు అద్దం పడుతోందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంట్‌లో ఈ ప్రకటన చేస్తుండగా రాష్ట్రా ఎంపీలు మౌనంగా ఉండడం తెలుగుజాతికే అవమానమని విమర్శించారు. అనంతపురంలో నిర్మించాల్సిన కేంద్రీయ విశ్వవిద్యాలయం నిధులు గురించి కేంద్ర మంత్రి కనీస ప్రస్థావన చేయకపోవడం విచాకరం అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాజకీయాలకతీతంగా రాయలసీమ ప్రజలు, మేధావులు యువకులు నిరసించాలని పిలుపునిచ్చారు.










