Jul 10,2023 21:07

సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌ వద్ద 36 గంటల ధర్నా ప్రారంభం
నలుపు చీరలు ధరించి వినూత్న నిరసన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విధానాలపై నిరసన హోరు
ధర్నాకు మద్దతు తెలిపిన సిపిఎం, ప్రజాసంఘాలు
అక్కడే అంగన్వాడీల రాత్రి బస
భవిష్యత్తులో సమ్మెకు సిద్ధం కావాలి
అంగన్వాడీల జిల్లా అధ్యక్షులు ఝాన్సీలక్ష్మి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం తగదు
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రారు
అంగన్వాడీలకు అండగా సిపిఎం
ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బలరాం
ప్రజాశక్తి - భీమవరం/భీమవరం రూరల్‌
ఒకపక్క హోరు గాలి.. మరోపక్క జోరు వాన.. ఇవేమీ లెక్క చేయకుండా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా అంగన్వాడీలు కదంతొక్కారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలొచ్చిన అంగన్వాడీలతో కలెక్టరేట్‌కు వెళ్లే ప్రాంతం జనసంద్రమైంది.
అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పిలుపులో భాగంగా అంగన్వాడీలు సోమవారం చేపట్టిన 36 గంటల నిరవధిక ధర్నా మొదటి రోజు విజయవంతమైంది. విస్సాకోడేరు పెద్దవంతెన సమీపాన కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో చేపట్టిన ధర్నాకు అంగన్వాడీ హెల్పర్లు, వర్కర్లు, మినీ వర్కర్లు సుమారు మూడు వేల మంది తరలొచ్చారు. వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ జోరు వాన కురుస్తున్నా అవేమీ లెక్కచేయకుండా అంగన్వాడీలంతా నలుపు చీరలు ధరించి వినూత్నరీతిలో నిరసన తెలిపారు. కనీస వేతనం రూ.26 వేలు ఆదించాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.ఐదు లక్షలివ్వాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయిలో జాయింట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని, హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం సరఫరా చేయాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, గ్యాస్‌ ప్రభుత్వమే సరఫరా చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.ఝాన్సీలక్ష్మి అధ్యక్షత వహించి మాట్లాడారు. సమస్యలపై తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ అంగన్వాడీలకు ఇచ్చిన హామీ గుర్తు లేదా అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు పాటు అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాయడం తప్ప అంగన్వాడీల కోసం ఆలోచన చేయలేదన్నారు.
2017 నుంచి టిఎలు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వాలు స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. యూనియన్‌ జిల్లా కార్యదర్శి డి.కళ్యాణి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనం గ్రాట్యూటీ అమలు చేయకపోవడం దారుణమన్నారు. సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ప్రజానాట్యమండలి నాయకులు షేక్‌ వలీ, చైతన్య ప్రసాద్‌ ఆలపించిన గీతాలు అంగన్వాడీల్లో ఉత్తేజాన్ని నింపాయి. కార్యక్రమానికి సిఐటియు జిల్లా నాయకులు తెలగంశెట్టి సత్యనారాయణ, కర్రి నాగేశ్వరరావు, పివి.ప్రతాప్‌, ఎస్‌.రంగారావు, బి.వాసుదేవరావు, ఎం.ఆంజనేయులు, వెంకటేశ్వరరావు, అంగన్వాడీల నాయకులు రాణి, ఎమ్‌డి.హసీనా, కె.తులసి, మహాలక్ష్మి, శ్యామల, స్వర్ణ, మార్తమ్మ, అమరావతి, ప్రభావతి, నాగరత్నం, రాజమణి, కుమారి, దేవి నాయకత్వం వహించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం తగదు
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు
మాతాశిశుసంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు అన్నారు. ధర్నానుద్దేశించి మాట్లాడుతూ అంగన్వాడీలను కేంద్రాలకు, తల్లీబిడ్డలకు దూరం చేస్తూ ఆన్‌లైన్‌ వర్క్‌లు అప్పగించి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ప్రస్తుత వేతనం పెరిగిన ధరలతో పోలిస్తే ఒక మూలకు కూడా రాదన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే మరింత ఉధృతంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి
సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్‌
అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్‌ డిమాండ్‌ చేశారు. ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడుతూ కష్టజీవుల కుటుంబాల్లోని మహిళలకు, పిల్లలకు సేవలందిస్తున్న అంగన్వాడీలు నిరుపేదలని, రూ.10 వేలు జీతం దాటింది, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే పేరుతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారికి అందకుండా అడ్డుకోవడం అత్యంత దారుణమన్నారు. గతంలో అంగన్వాడీలపై విరుచుకుపడ్డ చంద్రబాబు ప్రభుత్వం కుప్పకూలిందని, ఈ విషయాన్ని వైసిపి గమనంలో ఉంచుకోవాలని హెచ్చరించారు.
అంగన్వాడీలకు అండగా సిపిఎం
ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బలరాం
అంగన్వాడీలకు సిపిఎం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం చెప్పారు. అంగన్వాడీల ధర్నాకు మద్దతు ప్రకటించి బలరాం మాట్లాడారు. సమాజానికి సంబంధించి బాధ్యత గల కోర్కెలను అంగన్వాడీలు డిమాండ్లలో పొందుపర్చడం అభినందనీయమన్నారు. ఐసిడిఎస్‌ ను బలోపేతం చేయాలన్నారు. అంగన్వాడీల కష్టాలు, కృషి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదని విమర్శించారు. నూతన విద్య విధానం అత్యంత దుర్మార్గమైందన్నారు. విద్య, వైద్యం వంటి సౌకర్యాలు అంగన్వాడీలకు అందకపోవడం బాధాకరమన్నారు. చట్టాలు, హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలకు స్కీమ్‌వర్కర్లు ఐక్యంగా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
పలు సంఘాల మద్దతు
అంగన్వాడీల నిరవధిక ధర్నాకు పలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఐద్వా, రైతుసంఘం, కెవిపిఎస్‌, ఆశా వర్కర్స్‌ యూనియన్‌, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా నేతలు పి.పూర్ణ, జుత్తిగ నరసింహమూర్తి, కె.క్రాంతిబాబు, జ్యోతి, ఎ.అజయకుమారి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ పేరుతో వేధింపులకు గురి చేయడం దారుణమన్నారు. అంగన్వాడీలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
అక్కడే అంగన్వాడీల రాత్రి బస
36 గంటల పాటు నిరవధిక ధర్నా నేపథ్యంలో వేలాదిగా తరలొచ్చిన అంగన్వాడీలు ధర్నా ప్రాంతంలోనే సోమవారం రాత్రి బస చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ బట్టలు సంచిలో పెట్టుకుని, చిన్నారులను చంకనెత్తుకుని వచ్చిన అంగన్వాడీలు ధర్నా చోటే బస చేశారు. వాతావరణ మార్పులతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ అంగన్వాడీలు వెనుకంజ వేయకపోవడం విశేషం. స్థానికంగా వంటావార్పు చేసి నిరసన తెలిపారు.