ప్రజాశక్తి - ఆకివీడు
ప్రజలకు, ప్రతిపక్షాలకు సమస్యలొస్తే పాలకపక్షాన్ని నిలదీస్తారు.. మరి సమస్యలు పరిష్కరించాల్సిన పాలకపక్ష సభ్యులకే సమస్య ఏర్పడితే తీర్చేదెవరు? వారు ఎవరికి చెప్పుకోవాలి. ఇది ప్రస్తుతం నగర పంచాయతీలో పరిస్థితి. మంగళవారం సాయంకాలం స్థానిక నగర పంచాయతీ పాలకవర్గ అత్యవసర సమావేశం ఛైర్ పర్సన్ జామి హైమావతి అధ్యక్షతన జరిగింది. 17వ వార్డు కౌన్సిలర్ జిల్లా పెద్దిరాజు అధికారుల తీరును ఎండగట్టారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వైసిపి కౌన్సిలర్ పెద్దిరాజు తమ వార్డు పరిధిలో సమస్యలను వివరించారు. ప్రజలు రోజూ తనకు విన్నపాలు ఇస్తున్నారని, కొన్ని సమస్యలు వింటుంటే సిగ్గేసిందని తెలిపారు. తన దగ్గరకు వచ్చి మహిళలు తెలిపిన సమస్యలను ఛైర్ పర్సన్ జామి హైమావతి దృష్టికి తెచ్చానన్నారు. అయితే ఆమె అనారోగ్యంగా ఉండడంతో అధికారులకు తెలిపానని తెలిపారు. అయినా వారిలో చలనం లేదని, కౌన్సిలర్ అడిగినా అధికారులు పనిచేయకపోతే ఇంకా పాలకవర్గం ఎందుకు, సమావేశాలు ఎందుకు అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా తమ వార్డు పరిధిలోని సమతా నగర్, గంగానమ్మ కోడు ప్రాంతాలు వస్తాయని ఇవి స్లమ్ ఏరియాలో కావడంతో ప్రజలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. వార్డు పరిధిలో చెత్త ఎత్తే పరిస్థితి లేదన్నారు. ఇదే విషయాన్ని శానిటేషన్ ఇన్‌ఛార్జి ఫణికి ఫోన్ చేస్తే స్పందించలేదన్నారు. ఈ తరహాలో పరిపాలన ఉంటే ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ తిరుమలరావు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కౌన్సిలర్ పెద్దిరాజు ప్రజల సమస్యల పట్ల స్పందించకపోతే తాను ఎవరినీ లెక్కచేయనని తెలిపారు. కమిషనర్ వివరణ ఇస్తూ ఇప్పటి వరకూ నగర పంచాయతీకి సంబంధించి 20 వార్డుల పరిధిలో ఒక్కరే శానిటేషన్ పనులను పర్యవేక్షిస్తున్నారని, మార్చి ఒకటో తేదీ నుంచి శానిటేషన్ ముగ్గురిని నియమించామని, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తేవాలని తెలిపారు. దీనిపై ఛైర్ పర్సన్ జామి హైమావతి మాట్లాడుతూ 17వ వార్డులో బుధవారం పర్యటించి తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు. దీనిపై విపక్ష కౌన్సిలర్లు తమ దాకా వస్తే గాని ఎవరికి తెలియదంటూ దెప్పి పొడిచారు. నాడు అధికార పార్టీ సభ్యులు అధికారులకు వత్తాసు పలికారని, ఇప్పుడు స్వపక్ష పార్టీ కౌన్సిలర్లకు ఈ పరిస్థితి వచ్చిందని చమత్కరించారు.










