రాయదుర్గం రూరల్ : ప్రతి రైతు పిఎం కిసాన్ ఈకెవైసి తప్పనిసరిగా చేయించుకోవాలని, కౌలు రైతులు పంట సాగు హక్కుపత్రం పొందాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు. ఆమె బుధవారం మండల పరిధిలోని ఆవులదట్ల, 74-ఉడేగోళం రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బికె)ను సందర్శించారు. అలాగే పటణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న వైఎసఆర్ అగ్రీ టెస్టింగ్ ల్యాబ్‌ను పరిశీలించారు. 74-ఉడేగోళం ఆర్‌బికెలో సిబ్బందితో మాట్లాడుతూ కౌలు రైతులను గుర్తించి వారికి పంట సాగుదారుని హక్కు పత్రం అందించాలన్నారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుకు రూ. 13,500 రైతు భరోసా ఇస్తుందని, ఇది రైతుకు ఆసరాగా ఉంటుందన్నారు. వేరుశనగ విత్తనంతో పాటు, బ్యాంకులో రుణం తీసుకునేందుకు పంట సాగుదారుని హక్కు పత్రం ఉపయోగపడుతుందన్నారు. ఆర్‌బికె సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రతి సర్వే నంబర్‌ను సందర్శించి ఈ పంట నమోదు చేయాలని సూచించారు. చిరుధాన్యాల పంటల సాగును ప్రోత్సహించాలని, రైతులు సాగు చేసిన చిరుధాన్యాలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందనా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఆమె ఆర్‌బికెలో రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆమె వెంట వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మానాయక్, మండల వ్యవసాయ అధికారులు మహేంద్ర, అహ్మద్‌బాషా, నిర్మల్‌కుమార్, ఆర్‌బికె సిబ్బంది ఉన్నారు.










