Jun 04,2023 23:13

కరపత్రాలను విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి అనంతపురం కలెక్టరేట్‌
కౌలు రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని కౌలురైతులసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగారెడ్డి, బాలరంగయ్య, కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఒ.నల్లప్ప డిమాండ్‌ చేశారు. ఈనెల 12వ తేదీన విజయవాడ నుండి మంగళగిరి వరకు జరుగు కౌలు రైతుల పాదయాత్రకు సంబందించిన కరపత్రాలను స్థానిక గణేనాయక్‌ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో విడుదల చేశారు. ఈసందర్భంగా రంగారెడ్డి, బాలరంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలకు పైగా ఉన్న కౌలు రైతులను ఆదుకోవాలన్నారు. 2019 పంట సాగు దారుల చట్టం(సి.సి.ఆర్‌.సి) ప్రకారం గుర్తింపు కార్డు మంజూరుకు భూ యజమాని సంతకం తప్పనిసరి అనే నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో చట్టంలో మార్పులు చేసి కౌలు రైతుకు సులభంగా గుర్తింపు కార్డు మంజూరు చేయాలని, భూ యజమాని సంతకం తొలగింపు సాధనే లక్ష్యంగా కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో జూన్‌ 5 నుండి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార జాతాలు, సచివాలయాలు, తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద వినతిపత్రాలు సమర్పిస్తున్నట్లు చెప్పారు. పంటరుణాలు, రాయితీ ఎరువులు విత్తనాలు, పంట నష్టపోతే పరిహారం దక్కక కౌలు రైతులకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదని అన్నారు. భూ యజమాని సంతకం తప్పనిసరి అయిన నేపథ్యంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డు రావడం లేదని అన్నారు. భూ యజమాని సంతకంతో పని లేకుండా గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాల సిబ్బంది సంయుక్తంగా గ్రామ సభలు నిర్వహించి అసలైన కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, బీమా, ఈ క్రాప్‌, రాయితీపై రుణాలు, పంట అమ్ముకునేందుకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. పకతి వైపరీత్యాలతో పంట నష్టం వాటిల్లితే పరిహారం సౌకర్యం కల్పించి కౌలు రైతుల ఆత్మహత్యలు నివారించాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డు ప్రధాన అంశమని దీనికి ప్రధాన ఆటంకంగా ఉన్న భూ యజమాని సంతకం తొలగించాలన్న డిమాండ్‌ సాధన తమ సంఘం లక్ష్యమన్నారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి భూ యజమాని కౌలు రైతులతో గ్రామ సభ నిర్వహించి అర్హులైన కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఋణాలు ,బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ డిమాండ్‌ సాధన కోసం12 న విజయవాడ నుండి ప్రకాశం బ్యారేజీ మీదుగా మంగళగిరి సిసిఎల్‌ఎ కార్యాలయం వరకు నిర్వహించే రాయబార పాదయాత్ర కార్యక్రమంలో కౌలు రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు, కృష్ణమూర్తి, నాగమణి, భాస్కర్‌, రామాంజనేయులు, నాగరాజు, వెంకటనారాయణతో పాటు కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు