ప్రజాశక్తి-ఉరవకొండ కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కౌలు రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగారెడ్డి, బాల రంగయ్య డిమాండ్ చేశారు. గురువారం కౌలు రైతుసంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఆమిద్యాల గ్రామంలో ఉన్న యూనియన్ బ్యాంకు మేనేజర్ కిరణ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 30 వేల మంది కౌలురైతులు ఉంటే ప్రభుత్వం 5200 మందికి మాత్రమే సిసిఆర్‌సి కార్డులు మంజూరు చేసిందన్నారు. సిసిఆర్‌సి కార్డులున్న కౌలు రైతులకు ఇప్పటివరకు బ్యాంకు రుణాలు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎకరాకు రూ.30 నుంచి రూ.40 వేల వరకూ ముందస్తు గుత్తు చెల్లించి వ్యవసాయ పొలాల్లో పనులు చేసినా సకాలంలో వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం కౌలు రైతులకు ఎలాంటి సహాయ, సహకారాలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కనీసం బ్యాంకుల ద్వారానైనా కౌలు రైతులకు రుణాలు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు రైతు భరోసా, పంట నష్టపరిహారంతో పాటు పంటల బీమా ఇవ్వాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో ప్రభుత్వ, బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో కౌలు రైతులు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ఇప్పటికైనా స్పందించి ప్రతి ఒక్క కౌలు రైతుకూ రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతులు వెంకటేశులు, కుళ్లాయప్ప, లక్ష్మీనారాయణమ్మ, చిట్టెమ్మ, లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడుతున్న కౌలు రైతుసంఘం నాయకులు










