Jun 22,2022 23:18

కాసులు కురిపిస్తే...కావాల్సిన చోటుకు బది'లీలలు'

ప్రజాప్రతినిధుల 'సిఫార్సు' లేఖలకు డిమాండ్‌
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి

ప్రభుత్వం నిర్వహిస్తున్న బదిలీలు నాయకులకు కాసులు కురిపిస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను దక్కించుకునేందుకు అధికారులు ఎంతైనా ఇచ్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఈ మేరకు జోరుగా పైరవీలు సాగుతున్నాయి. దీంతో మంత్రులు, ఎంఎల్‌ఎలకు డిమాండు బాగా పెరిగింది. ఉద్యోగులు వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇతర జిల్లాలకు చెందిన మంత్రుల నుంచి కూడా సిఫార్సు లేఖలు తెస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే పైరవీలు ఏ మోతాదులో ఉన్నాయో ఇట్టే తెలిసిపోతుంది. కొన్ని శాఖల్లో ఇప్పటికే కౌన్సిలింగ్‌ ప్రారంభించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ వంటి కీలకశాఖల్లో బదిలీల వ్యవహారంలో రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన విషయం విదితమే. ఎనిమిదో తేదీ నుంచి 17వ తేదీ లోపు ప్రక్రియను మొత్తం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ సమయం చాలదు అని అధికారుల నుంచి ప్రభుత్వానికి నివేదికలు వెళ్లాయి. దీంతో ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం బదిలీలకు గడువు పెంచింది. వైద్య విద్యాశాఖలకు మినహాయింపు ఇచ్చింది. వాణిజ్య పన్నులు, అబ్కారీ, రవాణా, రిజిస్ట్రేషన్లు తదితర శాఖలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని శాఖల్లో అధికారి స్థాయి నుంచి అటెండరు స్థాయి వరకు బదిలీలు జరగనున్నాయి. మూడేళ్ల తరువాత బదిలీల్లో కదలిక రావడంతో ప్రాథాన్యం ఉన్న స్థానాల్లోకి వెల్లేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తున్నారు. అంతే కాకుండా ఎక్కువ మంది డిప్యూటేషన్లపై విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా అక్కడే ఉండేందుకు సిఫార్సు లేఖల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. సాధారణంగా నిబంధనల ప్రకారం ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీ కావాల్సి ఉంది. అలాగే అనారోగ్య సమస్యలు, స్పౌస్‌ కేసుల్లో వీటిని నిర్వహించనున్నారు. అవన్నీ పక్కన పెట్టి సిఫార్సులకే పెద్ద పీట వేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో పైరవీలు జోరుగా సాగుతున్నాయి.దీంతో ఎంఎల్‌ఎల సిఫార్సులతో వచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిప్యూటీ తహశీల్దార్లు, తహశీల్లార్ల బదిలీలకు సంబంధించి ఎంఎల్‌ఎలు ప్రాతిపాదించిన వారికే చోటు కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన డిటీల బదిలీల్లో 90 శాతం ఈ విధంగా జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే రిజిస్ట్రేషన్‌ శాఖలోనూ ఇదే విధంగా కోరుకునే స్థానానికి వెళ్లేందుకు అధికారులకు ముడుపులు అప్పజెప్పవిధంగా ఒప్పందాలు సాగుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు, పలమనేరు కేంద్రాలకు బదిలీ అయ్యేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.