ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ కాసులకు కక్కుర్తిపడి ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థల వ్యాపారానికి సహకరిస్తున్న ఆర్‌ఐఒ సురేష్‌బాబును వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ముందస్తు అడ్మిషన్లు, పుస్తకాల విక్రయం, తరగతులు నిర్వహిస్తున్న ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నగరంలోని ఆర్‌ఐఒ కార్యాలయం ఎదుట అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షలు కుళ్లాయిస్వామి, ఎఐఎస్‌బి జిల్లా కార్యదర్శి పథ్వీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి సురేష్ యాదవ్, ఎఐఎస్‌ఎ నాయకులు పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ నగరంలోని కొన్ని ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ తల్లిదండ్రుల నుంచి రూ.వేలు దండుకుంటున్నాయని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎస్‌ఆర్ విద్యా సంస్థ ముందస్తు అడ్మిషన్లు, తరగతులు నిర్వహిస్తోందన్నారు. అంతేగాకుండా ఆ సంస్థకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. ఆధారాలతో సహా ఆర్‌ఐఓకు ఫిర్యాదు చేస్తే కేవలం నోటీసులకు మాత్రమే పరిమితమయ్యారని విమర్శించారు. దీంతోపాటు మరిన్ని విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్నా ఆర్‌ఐఓ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ముడుపులు తీసుకోవడం వల్లే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఆర్‌ఐఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చంద్ర, రాజేష్, ముస్తఫా, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు ఉమామహేష్, ఆనంద్, విష్ణు, జగదీష్, ఏఐఎస్‌బి నాయకులు మారుతి, నరేష్, అజరు, నాగార్జున, బిస,ి ఎస్‌స్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమైక్య నాయకులు చంద్ర సాయి, ఎఐఎస్‌ఎ నాయకులు నితీష్ తదితరులు పాల్గొన్నారు.
అర్ధనగ ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు










