Apr 28,2023 08:18

భగీరథ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న కలెక్టర్‌

              అనంతపురం కలెక్టరేట్‌ : కార్యదీక్ష, ప్రయత్నంకు మారుపేరు మహర్షి భగీరథుడు అని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. భగీరథ మహర్షి జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నాడు అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో నిర్వహించారు. కేర్‌ అండ్‌ క్యూర్‌ హాస్పిటల్‌ వద్ద ఉన్న భగీరథ మహర్షి విగ్రహానికి ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయగిరిజమ్మ, కలెక్టర్‌ పి.గౌతమి, నగరపాలక సంస్థ మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌ రెడ్డి, వాసంతి సాహిత్య తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ జిల్లాలో ఉప్పర, సగర అని పిలవబడుతూ వెనుకబడిన తరగతుల వారు చాలామంది ఉన్నారని, వారిని గుర్తిస్తూ ప్రభుత్వం అధికారికంగా భగీరథ మహర్షి జయంతిని జరుపుతోందన్నారు. భగీరథ మహర్షి గడిపిన జీవితం, చేసిన బోధనలు అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ప్రయత్నానికి, కార్యదీక్షకు భగీరథ మహర్షి మారుపేరన్నారు. అని అన్నారు. ఒక కార్యక్రమాన్ని చేయాలంటే పట్టుదలతో, చిత్తశుద్ధితో కషిచేసిన వారిని అపర భగీరథుడు అని అంటారన్నారు. భగీరథ మహర్షిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గంగ కోసం భగీరథ ప్రయత్నం చాలా గొప్పదన్నారు. భగీరథ మహర్షి స్ఫూర్తి అందరిలోనూ కొనసాగాలన్నారు. భగీరథ మహర్షి జయంతిని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలనే స్ఫూర్తితో ప్రభుత్వ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌ హరిత, ఆహుడా ఛైర్మన్‌ మహాలక్ష్మి శ్రీనివాస్‌, ఏడీసీసీ బ్యాంక్‌ ఛైర్‌పర్సన్‌ లిఖిత, బీసీ వెల్ఫేర్‌ డిడి కుష్బు కొఠారి, బీసీ వెల్ఫేర్‌ అధికారులు, సగర కుల నాయకులు పాల్గొన్నారు.