ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ దేశంలోని రైతులు, కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దగా చేసిందని రైతు, కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. మంగళవారం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్లచట్టాలను నిరసిస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్‌డేగా పరిగణిస్తూ కృష్ణ కళామందిరం నుంచి ఎన్టీఆర్ విగ్రహం మీదుగా టవర్‌క్లాక్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, కార్యదర్శి మల్లికార్జున, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు నాగమణి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రైతాగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం తేవాలన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలన్నారు. 2021 అక్టోబర్ 3న ఢిల్లీ రైతాంగ ఉద్యమ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని లకింపూర్ ఖేరిలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న రైతులను కార్లతో తొక్కించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు నలుగురు రైతు ఉద్యమకారులను అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగిందని గుర్తు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా ను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని దేశవ్యాప్తంగా రైతాంగం ముక్తకంఠంతో డిమాండ్ చేసినా కేంద్ర మోదీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. మారణకాండకు కారణమైన కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాను, బిజెపి గుండాలను శిక్షించకుండా వదిలేయడం దుర్మార్గమన్నారు. ఢిల్లీ రైతాంగం సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలకు మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం వెంటనే తీసుకురావాలని కోరారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి ఎం.బాల రంగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.కష్ణమూర్తి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ నారాయణ, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రాజేష్‌గౌడ్, సిఐటియు నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, ఏఐటియుసి నగర అధ్యక్షులు వికే.కష్ణుడు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు బండారి ఎర్రిస్వామి, కోశాధికారి లక్ష్మీనరసమ్మ, ఆటో యూనియన్ నాయకులు శివ ప్రసాద్, నాగరాజు, రామాంజనేయులు, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
శింగనమల : రైతు పండించిన పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించి అన్నివిధాలుగా ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు. బ్లాక్ డే సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో నల్లరిబ్బన్లతో కళ్లకు గంతలు కట్టుకుని మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలన్నారు. ముఖ్యంగా మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, రైతుల మోటార్లకు మీటర్ల బిగింపును ఉపసంహరించుకోవాలని, లక్కీమ్ పూర్ కెరీర్‌లో రైతుల మరణానికి కారణమైన కేంద్రమంత్రి అజరుకుమార్ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి ఏడాదిలో 200 రోజులు పని దినాలు కల్పించి రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, ఒక్కొక్క సిలిండర్ ధర రూ.400తో సంవత్సరంలో మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా, భూమిలేని కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్య.కా.సం మండల కార్యదర్శి సుంకన్న, రైతుసంఘం మండల కమిటీ సభ్యులు వెంకటస్వామి, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, వెంకట్‌నారాయణ, కుళ్లాయిస్వామి, వెంకటేష్, ఆదినారాయణ, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం టవర్‌క్లాక్ వద్ద నిరసన తెలుపుతున్న రైతుసంఘాల నాయకులు










