Jul 07,2023 21:58

గుత్తిలో మున్సిపల్‌ కార్మికుల యూనియన్‌ నాయకులకు అరెస్టు నోటీసులు జారీ చేస్తున్న పోలీసులు

          ప్రజాశక్తి-అనంత పురం కార్పొరేషన్‌   మున్సిపల్‌ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి జగన్‌, రాష్ట్ర ప్రభుత్వానికి భయమెందుకని సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్రకుమార్‌, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం, జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కళ్యాణదుర్గం పర్యటనకు వస్తున్న సందర్భంగా సిఎం జగన్‌ను కలవాలని ప్రయత్నించేందుకు వెళ్లేందుకు కార్మికులు, యూనియన్‌ నాయకులు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎందుకు అరెస్టులు చేస్తున్నారని ప్రశ్నించారు. మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే కరోనా సమయంలో, వరదల విపత్తుల్లో పని చేసిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఇదివరకే గుత్తి పురపాలక సంఘంలో ఉన్న మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు రామాంజనేయులు సూర్యనారాయణ మహేష్‌ను అరెస్టు చేశారన్నారు. అరెస్టు అయిన వారిని వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో అన్ని పట్టణాల ప్రజాప్రతినిధులు కలిసి ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
గుత్తి : మున్సిపల్‌ పారిశుధ్య కాంట్రాక్టు కార్మికుల సంఘం నాయకులను శుక్రవారం సాయంత్రం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. శనివారం సిఎం జగన్‌ కళ్యాణదుర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో అడ్డుకుంటారనే నెపంతో స్థానిక నాయకులు కె.సూర్యనారాయణ, ఎన్‌.రామాంజనేయులు కె.మహేష్‌ను పోలీసులు అరెస్టు చేసి నోటీసులు అందజేశారు. తమను అరెస్టు చేయడం అన్యాయమని నాయకులు తెలిపారు.
ఉరవకొండ : సిఎం జగన్‌ పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఎస్‌ఎఫ్‌ఐ ఉరవకొండ విద్యార్థి సంఘం నాయకులు సింహాద్రి, సురేష్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యకం అని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి సిద్ధార్థ శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలకూ పిలుపు ఇవ్వకపోయినా విద్యార్థి సంఘం నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చి నిర్బంధించడం సమంజసం కాదన్నారు. అదేవిధంగా విడపనకల్‌ మండలం పోలీసులు సిపిఐ ఉరవకొండ నియోజకవర్గ సహాయ కార్యదర్శి చిన్న రాయుడును స్టేషన్‌కు పిలిపించి నోటీసులు ఇస్తూ అరెస్టు చేయడం బాధాకరమన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా పాలకులు పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన సాగిస్తున్నారని వాపోయారు.