500 రోజులకు చేరిన అటవీ కార్మికులరిలేదీక్ష
పట్టించుకోని టిటిడి ఉన్నతాధికారులు
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
'టిటిడి ఫారెస్టు కార్మికులు.. వారేమీ గొంతెమ్మ కోర్కెలు కోరలేదు.. టైంస్కేల్‌తో పాటు హెచ్‌ఆర్‌ఎ, డిఎ ఇవ్వాలన్నది వారి ప్రధాన ఏకైక డిమాండ్.. అది కూడా పాదయాత్రల సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనే.. అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మకర్తల మండలి చేసిన తీర్మానాన్ని అమలు చేయాలనే వారు కోరుతున్నారు.. ఢిల్లీలో నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం ప్రారంభించిన రోజునే వీరూ రిలేదీక్ష ప్రారంభించారు. రైతుల ఐక్యతతో చేసిన ఉద్యమంతో మోడీ దిగి రాక తప్పలేదు.. అయితే ధార్మిక సంస్థ అయిన టిటిడిలో మానవత్వం లేకుండా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. 500 రోజులుగా ఆందోళన చేస్తున్న టిటిడి ఫారెస్టు కార్మికుల ఒకే ఒక్క డిమాండ్‌ను పరిష్కరించకుండా వ్యవహరిస్తున్నారంటే వీరు కార్మికుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్ధమవుతోంది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో 1989-90 మధ్యకాలంలో 1200 మంది ఫారెస్టు కార్మికులు పనిచేసేవారు. ఎపుడో ఒకసారి పర్మినెంట్ చేస్తారనే ఆశతో నెలకు 500 రూపాయల వేతనాన్ని తీసుకునేవారు. సొసైటీ ద్వారా విధుల్లో కొనసాగాలని, పర్మినెంట్ చేయలేమని టిటిడి అప్పట్లో తేల్చి చెప్పింది. దీంతో అనారోగ్యరీత్యా కొంతమంది, చాలీచాలని వేతనాలతో బతకలేక మరికొంతమంది నిలిచిపోయారు. ప్రస్తుతం 360 మంది కొనసాగుతున్నారు. వీరికి కనీస వేతనం జీవో అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో దీర్ఘకాలికంగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఫలితంగా టైంస్కేల్ ఇస్తోంది. అయితే ఫారెస్టు కార్మికులు మాత్రం దీనివల్ల తమకు 13,400 రూపాయలు మాత్రమే వస్తోందని, కటింగ్‌లు పోగా 11,040 మాత్రమే చేతికొస్తోందని, కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని తెలిపారు. టైంస్కేల్‌తో పాటు హెచ్‌ఆర్‌ఎ, డిఎ ఇస్తే 26వేల రూపాయలు పైగా జీతం వస్తోందని, కుటుంబ పోషణ సాధ్యమవుతుందని అటవీ కార్మికులు కోరుతున్నారు. ఇదే సమస్యపై పాదయాత్ర సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డిని కలిసారు. తాము అధికారంలోకి వస్తే టైంస్కేలే కాదు, పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత వైవి సుబ్బారెడ్డి హయాంలోనే 'మీది న్యాయమైన డిమాండ్ అని, దీనిపై తీర్మానం చేస్తున్నాం' అని చెప్పారు. హామీ ఇచ్చి మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు వీరి డిమాండ్‌ను పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో హామీ అమలు కోసం 500 రోజులుగా రిలే దీక్ష చేస్తూనే ఉన్నారు. టిటిడి డిఎఫ్‌ఒ కార్యాలయం ఎదుట ఎండనకా, వాననకా, పండగ పబ్బం సైతం జరుపుకోకుండా ఆందోళన కొనసాగిస్తూనే ఉండటం గమనార్హం.
కార్పొరేషన్‌లో కలవమంటున్నారు : సురేష్, టిటిడి ఫారెస్టు వర్కర్స్ యూనియన్ కార్యదర్శి
ఒకే డిమాండ్‌పై 500 రోజులుగా ఆందోళన చేస్తున్నా టిటిడి ఉన్నతాధికారులు మాన వత్వం మరిచారు. మేము అడిగిన డిమాండ్‌కు సిఎం హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీని అమలు చేయమనే ఆందోళన చేస్తున్నాం తప్ప గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. మా సమస్య పరిష్కరించకపోగా శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ (టిటిడి)లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. దీనిలో చేరితే మా సీనియారిటీ పూర్తిగా పోతుంది. ఉద్యోగ భద్రత ఉండదు.
టిటిడిలో మానవసేవ ఎక్కడీ : కందారపు మురళి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి
ధర్మాన్ని రక్షించండి.. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది.. మానవసేవే మాధవసేవ.. టిటిడిలో నినాదాలు చెప్పడానికి చాలా బాగుంటాయి.. అయితే ఆచరణలోనే అమలుకు నోచుకోవడం లేదు. ఒక్క టిటిడి ఫారెస్టు కార్మికుల 500 రోజుల పోరాటమే నిదర్శనం. భయపెట్టి కార్పొరేషన్‌లో చేర్చుకోవాలని టిటిడి యాజమాన్యం ఒత్తిడి తేవడం దుర్మార్గమైన చర్య. వెంటనే ఫారెస్టు కార్మికుల ఏకైక డిమాండ్‌ను పరిష్కరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి.










