అనంతపురం కలెక్టరేట్ : కష్టపడి పని చేసిన కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ కోతలు విధించి ఆ డబ్బులు కాజేయడం దుర్మార్గం అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్, ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయాల ఎదుట మంగళవారం ఉదయం ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ అధ్యక్షతన నిర్వహించిన ధర్నాకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నీలకంఠాపురం శ్రీరామ్‌రెడ్డి తాగునీటి పథకంలో పని చేస్తున్న హిందూపురం, మడకశిర డివిజన్‌లలోని కార్మికులకు 5 నెలలుగా వేతనాలు బకాయిపడ్డాయన్నారు. 14 నెలల పిఎఫ్, ఇఎస్‌ఐ చెల్లించకపోవడం దుర్మార్గంగా ఉందన్నారు. కాంట్రాక్టర్ కలాం నాయుడు 120 మంది కార్మికుల వేతనాల్లో మూడు సంవత్సరాల పాటు రూ.2500 వేతనాల్లో కోతలు విధించి కార్మికుల సొమ్ము కాజేశాడన్నారు. 3 సంవత్సరాలుగా 120 మంది బోగస్ కార్మికులను సృష్టించి ఒక్కొక్కరి పేరు మీద నెలకు రూ.15 వేల చొప్పున చెల్లించినట్లు తప్పుడు లెక్కలు చూపించి ప్రభుత్వం నుంచి దోచుకున్నారని తెలిపారు. ప్రభుత్వం అధికారులు విచారణ జరిపించి 19 మంది కార్మికుల పేర్లతో వేతనాలు కాజేసినట్లు తేల్చారన్నారు. వాస్తవానికి 120 మంది బోగస్ కార్మికుల పేర్లతో నెలనెలా వేతనాలు చెల్లించినట్లు చూపించి కాంట్రాక్టర్ కాజేశాడన్నారు. 120 మంది కార్మికులకు 3 సంవత్సరాల పాటు చెల్లించిన వేతనాలు లెక్కిస్తే రూ.6.48 కోట్లు అవుతుందన్నారు. అధికారులు మాత్రం 19 మంది బోగస్ కార్మికుల పేర్లతో కాజేసినట్లు తేల్చారన్నారు. వాటిపై కూడా ఇంత వరకు అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఈ అవినీతి అక్రమాల్లో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల పాత్ర కూడా ఉందన్న విమర్శలు ఉన్నాయన్నారు. ఎస్‌ఎస్‌ఆర్ రేట్లతో కాకుండా కోతలు విధించి కాంట్రాక్టర్ వేతనాలు చెల్లిస్తుంటే అధికారులు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. వేతనాల్లో కోతలు విధించిన కాంట్రాక్టర్ కలాం నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆ డబ్బులను ఆయన నుంచి రికవరి చేసి కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇందులో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపించాలన్నారు. అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్ కలాం నాయుడు కాంట్రాక్ట్ లైసెన్స్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలన్నారు. కార్మికుల బకాయి పడ్డ 5 నెలల వేతనాలు, 15 నెలల పిఎఫ్ చెల్లించాలన్నారు. శ్రీసత్యసాయి జిల్లా శ్రీరామ్‌రెడ్డి కార్మికులకు వేతనాలు పెంచాలన్నారు. వేతనాలు చెల్లించేప్పుడు ఇఎస్‌ఐ, పిఎఫ్ చెల్లించాలన్నారు. అనంతరం కలెక్టర్ ఎమ్.గౌతమిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్‌రెడ్డి కార్మికుల యూనియన్ నాయకులు సుబ్బరాజు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.










