May 15,2023 22:45

ఆందోళనలో మాట్లాడుతున్న ఇంతియాజ్‌

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ :పంచాయతీ, స్వచ్ఛభారత్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఇంతియాజ్‌ హెచ్చరించారు. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముందు బైఠాయించి కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇంతియాజ్‌ మాట్లాడుతూ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. పంచాయతీ, స్వచ్ఛభారత్‌ కార్మికులకు పలుచోట్ల 3 నుంచి 9 నెలల వరకు వేతనాలు ఇవ్వకుండా పెండింగ్‌ లో పెట్టారన్నారు. స్వచ్ఛభారత్‌ కార్మికులకు నిబంధనల ప్రకారం రూ. 6 వేలు ఇవ్వాల్సి ఉండగా వారికి చాలా పంచాయతీలలో అంత మొత్తం ఇవ్వడం లేదన్నారు. కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. అలాగే గ్రామాల్లో దళితులకు శ్మశాన వాటిక కోసం రెండు ఎకరాలు భూమి కేటాయించాలని అందులో మౌలిక సదుపాయాలు కల్పించాలని జీవో ఉందని చెప్పారు. జిల్లా పంచాయతీ వర్కర్ల సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్‌ మాట్లాడుతూ పలు పంచాయతీ కార్యదర్శులు పోస్టుల రెన్యువల్‌ చేయడం లేదన్నారు. పంచాయతీల ఆదాయం బట్టి కార్మికుల వేతనాలు పెంచాలన్నారు. అనంతరం కలెక్టర్‌ అరుణ్‌ బాబుకు వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్‌ సానుకూలంగా స్పందిస్తూ స్పందన రోజు కాకుండా బుధ లేదా గురువారం వస్తే పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సజ్జరామప్ప, నాయకులు ఆది, రమేష్‌, మహబూబ్‌ బాషా, అంజినప్ప, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.