Aug 02,2023 22:10

కార్మికులకు మద్దతుగా దీక్షల్లో కూర్చొన్న మాజీ మంత్రి శైలజానాథ్‌

         అనంతపురం కలెక్టరేట్‌ : ఆర్‌డబ్య్లూఎస్‌ శ్రీసత్యసాయి, శ్రీరామ్‌రెడ్డి తాగునీటి పథకంలో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తాగునీటి పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన రిలే నిరసన దీక్షలు బుధవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. వీరి దీక్షలకు మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకులు సాకే శైలజానాథ్‌ హాజరై మద్దతు తెలిపారు. కార్మికుల సమస్యలపై నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎంతో అవసరమైన తాగునీటి పథకాలు సజావుగా నడవాలంటే ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు కేటాయించి, కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. చాలీచాలని వేతనాలతో వారి కుటుంబాలు పోషించుకుంటున్నారని, నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోతే వారి పిల్లల చదవులు, వైద్య సమస్యలు, ఇంటి అద్దెలు ఎలా చెల్లించగలుగుతారని ప్రశ్నించారు. ఇచ్చే వేతనాలు సకాలంలో చెల్లించాలని కోరారు. శాశ్వత పనులు చేస్తున్న కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు మాట్లాడుతూ కార్మికులకు రావాల్సిన బకాయి వేతనాలు, ఇఎస్‌ఐ, పిఎఫ్‌, గ్రాట్యూటీ చెల్లించేంత వరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, జిల్లా కౌలు రైతు ప్రధాన కార్యదర్శి ఎం.బాల రంగయ్య, సిఐటియు జిల్లా కోశాధికారి గోపాల్‌, నగర కార్యదర్శి వెంకటనారాయణ, శ్రీసత్యసాయి శ్రీరామ్‌ రెడ్డి కార్మికుల యూనియన్‌ నాయకులు బి.నాగరాజు, కొండారెడ్డి, తిప్పయ్య, స్వామి, శ్రీనివాసులు, వస్కారప్ప పాల్గొన్నారు.