ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఇంజినీరింగ్ కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఇంజినీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమిస్కిల్డ్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో-7 ఇచ్చిందన్నారు. జీవో వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా నేటికీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వకుండా కేవలం రూ.15వేలు మాత్రమే ఇస్తుండడం దుర్మార్గమన్నారు. జీవో ప్రకారం కార్మికులకు వెంటనే రూ.18,500 ఇవ్వాలని, 2011లో 9 నెలలు బకాయి ఉన్న ఇపిఎఫ్ అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరికీ సమాన పనికి-సమాన వేతనం ఇచ్చి పర్మినెంట్ చేయాలని, రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని, హెల్త్ అలవెన్స్, ఇవ్వాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మహిళా కార్మికులపై ఒత్తిడి తగ్గించాలని, డిమాండ్ చేశారు. మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం, రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షులు ఏటీఎం నాగరాజు మాట్లాడుతూ ఇప్పటికైనా కార్మిక సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బత్తల ఆదినారాయణ, ఎం.ఆది, ఎలక్ట్రీషన్లు రాయుడు, మల్లి, మురళి, ఓబుళపతి, వాటర్ వర్క్స్ గౌరీ లొకేషనప్ప, లక్ష్మయ్య, లోకేష్, సురేష్, కుళ్లాయమ్మ, నరసమ్మ, లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.
ధర్నా చేస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు










