Jun 22,2023 21:49

మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న యూనియన్‌ నాయకులు

          ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌    మున్సిపల్‌ రెగ్యులర్‌, ఔట్‌సోర్సింగ్‌ పారిశుధ్య, ఇంజినీరింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగభూషణం డిమాండ్‌ చేశారు. సిఐటియు అనుబంధం మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్‌ పరిపాలన శాఖ డైరెక్టర్‌ పి.కోటేశ్వరరావుకు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జగన్‌ ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కిందన్నారు. అంతేగాకుండా సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సిఎం హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ఇంజినీరింగ్‌ కార్మికులకు స్కిల్డ్‌,-సెమిస్కిల్డ్‌, రిస్క్‌, హెల్త్‌ అలవెన్స్‌ అమలు చేయకుండా కేవలం కాంట్రాక్ట్‌ కార్మికుల్ని రెగ్యులర్‌ చేస్తామనడం సమంజసం కాదన్నారు. దశాబ్ధాల తరబడి మున్సిపల్‌ కార్మికులు చాలీచాలని వేతనాలతో బతుకులు ఈడుస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కాంట్రాక్ట్‌ కార్మికులతోపాటు మున్సిపల్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులు కె.ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు సోమయ్య, ముత్యాలరావు, కోశాధికారి జ్యోతిబసు, పెంచల నరసయ్య, ఎన్‌వై.నాయుడు, నాగేంద్రబాబు, వరికూటి రాజు, నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.