May 18,2023 21:46

సిఐ ఆనందరావుతో వాగ్వివాదం చేస్తున్న సిఐటియు నాయకులు

        ప్రజాశక్తి-తాడిపత్రి   కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు అధికారులు, పాలకులకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోయిందని సిఐటియు నాయకులు జగన్మోహన్‌రెడ్డి వాపోయారు. గురువారం తాడిపత్రి పురపాలక సంఘం కౌన్సిల్‌ సమావేశం నిర్వహిస్తున్న సమయంలో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు అర్ధనగంగా కౌన్సిల్‌ సమావేశ భవనాన్ని ముట్టడించారు. ముందుగా పాత పురపాలక సంఘం కార్యాలయం నుంచి సిఐటియు నాయకులు, మున్సిపల్‌ కార్మికులు ర్యాలీగా మున్సిపల్‌ సమావేశం నిర్వహిస్తున్న చోటుకు వెళ్లేందుకు యత్నించారు. అయితే విషయం తెలుసుకున్న సిఐ ఆనందరావు అడ్డుకుని ర్యాలీని అనుమతించేది లేదని చెప్పారు. దీంతో సిఐటియు నాయకులు సీఐతో వాగ్వివాదానికి దికారు. అనంతరం సిఐటియు నాయకులు డిఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించిన డీఎస్పీ ర్యాలీకు అనుమతించారు. అనంతరం ర్యాలీగా మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకుని ప్రధాన గేటు వద్ద భైఠాయించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జగన్మోహన్‌ రెడ్డి, మున్సిపల్‌ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎటిఎం నాగరాజు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేకమార్లు అధికారుల, పాలకుల దష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మున్సిపల్‌ రెగ్యులర్‌ కార్మికులకు రెండు సంవత్సరాల సరెండర్‌ లీవ్‌లు ఇవ్వాలని, కొబ్బరి నూనె, సబ్బులు, యూనిఫాం, చెప్పులు పంపిణీ చేయాలని, సిపిఎస్‌ రద్దు చేయాలని, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సకాలంలో హెల్త్‌ అలవెన్సులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తర్వాత మున్సిపల్‌ కమిషనర్‌కి వినతిపత్రం అందజేశారు. వారం రోజుల్లో కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.