ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు చేయాల్సిన అవసరం ఆసన్నమైందని సిఐటియు రాష్ట్ర నాయకులు జి.ఓబులు పిలుపునిచ్చారు. ఈమేరకు సిఐటియు ఉమ్మడి మాజీ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ సత్యనారాయణ వర్థంతిని పురస్కరించుకుని నగరంలోని గణేనాయక్ భవన్‌లో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యనారాయణ సిఐటియు ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షునిగా 1970 నుంచి 2022 వరకు కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేశారని గుర్తు చేశారు. 19 సంవత్సరాల వయసులోనే నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని కొనిడారు. కార్మికుల జీవితాల్లో వెలుగు నింపడానికి ఉద్యమాలను ఆయుధంగా చేసుకున్నారన్నారు. ఈ క్రమంలోనే సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశంఖం పూరించడంలో ఆధ్యుడిగా నిలిచారన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాల్సిన అవసరం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నాగమణి, ఎస్.నాగేంద్రకుమార్, నగర కార్యదర్శి వెంకటనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసులు, వరలక్ష్మి, అజాం, లక్ష్మీనారాయణ, నాగేంద్ర, చంద్ర, ఎర్రిస్వామి, తదితరులు పాల్గొన్నారు.
కామ్రేడ్ సత్యనారాయణకు నివాళులర్పిస్తున్న సిఐటియు నాయకులు










