Jul 08,2022 23:50

సమ్మె శిబిరం వద్ద మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చైతన్య

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చైతన్య
ప్రజాశక్తి- నగరి:
కూలి పెంచాలని, పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలని కోరుతూ నగరి పట్టణంలో పవర్‌ లూం కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె నాలుగవ రోజుకు చేరుకుంది. శుక్రవారం నాటి ఉదయం ఏకాంబర కుప్పం సెంటర్లో పవర్‌ లూమ్‌ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్‌ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభను ఉద్దేశించి సిఐటియు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చైతన్య ప్రసంగిస్తూ కార్మికులు చేపట్టిన న్యాయమైన పోరాటాన్ని అభినందించారు. ఐకమత్యంతో విజయం సాధించవచ్చునని అన్నారు. నగరి నియోజకవర్గం నారాయణవనంలో 50వేలకు పైగా కుటుంబాలు పవర్లూమ్‌ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్నాయని కరోనా తరువాత వీరి పరిస్థితి దయనీయంగా తయారైందని అన్నారు. పుండు మీద కారం చల్లినట్టు ఉన్న బాధలకు అదనంగా కరెంటు చార్జీలు పెరగడం తోడైందని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కూలి నూరు శాతం పెంచమని అడగటం న్యాయమైందని... తక్షణం అధికార యంత్రాంగం జోక్యం చేసుకొని పవర్‌ లూమ్‌ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కరోనాకు ముందు తరువాత కాలంలో పలుమార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారని, తాజాగా విద్యుత్‌ సుంకం పేరుతో 6 పైసలు ఉన్న యూనిట్‌ ధరను రూపాయికి పెంచారని దీంతో గణనీయమైన భారం కార్మికులపై పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించకపోగా, అదనపు భారాలు వేయటాన్ని తీవ్రంగా విమర్శించారు. సిఐటియు తిరుపతి జిల్లా కోశాధికారి జి.బాలసుబ్రమణ్యం, నగరి నియోజవర్గ కార్యదర్శి వెంకటేష్‌, వ్యవసాయ కార్మిక సంఘంనేత చిరంజీవమ్మ, జగదీష్‌, షణ్ముగం తదితరులతో పాటు నగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన పవర్‌ లూం కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.