ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా వచ్చేనెల 5న కార్మిక, రైతుసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎం.నాగమణి, జిల్లా గౌరవాధ్యక్షులు ఆర్‌వి.నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక గణేనాయక్ భవన్‌లో సివిల్ సప్లరు హామాలీ యూనియన్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీకి సంబంధించిన గోడపత్రికలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు, కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు చలో ఢిల్లీకి పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లరు హమాలీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నారాయణస్వామి, శంకర్, కోశాధికారి సుబాన్, మేస్త్రీలు విజరు, నాగరాజు, రామచంద్ర, వెంకటప్ప, శంకర్, నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.
ఉరవకొండ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి మధుసూదన్, కౌలు రైతుసంఘం జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి విమర్శించారు. మంగళవారం ఉరవకొండలోని సిపిఎం కార్యాలయంలో ఏప్రిల్ 5న తలపెట్టిన చలో ఢిల్లీకి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీల హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతోందన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారం చేపట్టి బడుగు, బలహీన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యంగా అధికార, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. అంతేగాకుండా బడాబాబుల కొమ్ముకాస్తూ ప్రయివేటు వ్యక్తులకు అనుకూలంగా చట్టాలను రద్దు చేస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం మెడలు వంచేందుకు ఏప్రిల్ 5న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకటేశులు, రాము తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు : వచ్చేనెల 5న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను మంగళవారం మండలం కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విడుదల చేశారు. ఈసందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మికులు, కర్షక వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు అధ్యక్ష, కార్యదర్శలు జయమ్మ, రమాదేవి, మండల నాయకులు శివశంకర్, మధ్యాహ్న భోజన కార్మికులు మీనాక్షి, సుబ్బమ్మ, మారెక్క, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురంలో కరపత్రాలు విడుదల చేస్తున్న సిఐటియు నాయకులు










