May 02,2023 09:47

అనంతపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు, సిఐటియు అనంతపురం జిల్లా నాయకులు, కార్మికులు

           అనంతపురం కలెక్టరేట్‌ : కార్మికులు, కర్షకులు, శ్రామికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం రాబోవు రోజుల్లో ఐక్యంగా ఉద్యమిస్తామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు అన్నారు. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరాలు, గ్రామాల్లో వాడవాడలా సిఐటియు జెండాలు ఎగురవేశారు. అనంతపురం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్‌, టవర్‌క్లాక్‌ మీదుగా కృష్ణకళా మందిరం వరకు నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. సిఐటియు నగర కార్యదర్శులు వెంకటనారాయణ, ముర్తుజా అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. 8 గంటల పని దినం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకుంటూ వారి ఆశయాలు, స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడుతామని దీక్షబూనే రోజు మేడే అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక సంరక్షణ చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. హక్కులు హరించేలా లేబర్‌కోడ్‌లు తీసుకొచ్చి కార్మికులను తిరిగి శ్రమ దోపిడీ, వెట్టి చాకిరీలోకి నెట్టేసే విధానాలు అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ములతో ప్రారంభించిన ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మేస్తోందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రయివేటీకరిస్తోందన్నారు. రాజ్యాంగ హక్కులు, ప్రజా స్వామ్యం, కార్మికుల హక్కులపై మోదీ ప్రభుత్వం దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వ విధానాలపై ప్రజలను చైతన్య పరిచి పోరాటాలకు శ్రీకారం చడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే అన్ని కార్మిక సంఘాల పోరాట కార్యచరణ రూపొందించాయని, ఆగస్ట్‌ ప్రచారాన్ని నిర్వహించి భవిష్యత్‌ పోరాటాలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో పోరాటాలు సాగుతున్నాయని తెలిపారు. ఫ్రాన్స్‌, ఇటలీ, బ్రిటన్‌, అమెరికాలో ఉన్న హక్కులను నిలబెట్టుకోవడానికి పోరాటాలు చేస్తున్నారని ఇది అభినందనీయం అన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం కార్మికులతో పాటు, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. బిజెపి రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిలు మాట్లాడని పరిస్థితి ఉందన్నారు. ప్రధాన ప్రతిపక్షాలు టిడిపి, జనసేన పార్టీలు కూడా మిన్నకుండి పోవడం నష్టమే అన్నారు. మోదీవైపు ఉంటారో, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం వైపు నిలబడతారో వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి, జనసేన పార్టీలు తేల్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో దేశానికి నష్టం జరుగుతోందన్నారు. కరోనా సమయంలో ముందస్తు చర్యలు చేపట్టకుండా లాక్‌డౌన్‌ విధించిందన్నారు. బిజెపి ప్రభుత్వానికి గుణపాఠం నేర్పే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. కార్మికులు, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. రెగ్యులరైజేషన్‌ చేస్తామని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదన్నారు. మున్సిపల్‌ కార్మికులు, స్కీం వర్కర్‌లు అనేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎజి.రాజమోహన్‌, జిల్లా కోశాధికారి గోపాల్‌, మెడికల్‌ రెప్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి మనోహర్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం, జిల్లా అధ్యక్షులు ఎటిఎం.నాగరాజు, శ్రీనివాసులు, తిరుమలేష్‌, ఎర్రిస్వామి, గురురాజు, లక్ష్మినరసమ్మ, వరలక్ష్మి, కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల యూనియన్‌ జిల్లా అధ్యక్షులు విజరు, అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా కోశాధికారి జమున, అగ్రికల్చర్‌ కోఆపరేటీవ్‌ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసులు, హమాలీ యూనియన్‌ నాయకులు బాబు, సుభహాన్‌, ఆటో యూనియన్‌ నాయకులు ఆది, నాగరాజు, ఆజాం, గూడ్స్‌షెడ్‌ హమాలీ యూనియన్‌ నాయకులు మసూద్‌, సులేమాన్‌, సుధాకర్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మన్నీల రామాంజినేయులు పాల్గొన్నారు.