ప్రజాశక్తి-గుంతకల్లు కేంద్ర ప్రభుత్వం అనుస రిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐఎఫ్‌టియు జాతీ య ఉపాధ్యక్షుడు పి.ప్రసాద్ పిలుపు నిచ్చారు. శనివారం పట్టణంలోని గాయత్రీ ఫంక్షన్ హాల్‌లో ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.వెంకటేశ్వర్లు, జె.వెంకటేశ్వర్లు, ఆర్.హరికృష్ణ అధ్యక్షతన రాష్ట్ర వర్క్‌షాప్, రాజకీయ శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ప్రాదేశిక సూత్రాల్లో పేర్కొన్న యూనిఫాం సివిల్ కోడ్ అనే అంశాన్ని మోడీ, షాల ప్రభుత్వం ముందుకు తేవటం ద్వారా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ముంచుకొస్తున్నాయన్నారు. ముఖ్యంగా మణిపూర్‌లో మైతేయి తెగను రెచ్చగొట్టి కుకీ, నాగా తెగలపై దాడులు చేయిస్తూ మత కల్లోలాన్ని సృష్టించడమే కాకుండా స్త్రీలను నగంగా ఊరేగించే స్థాయికి చేరిన విధానాలకు కేంద్రంతోపాటు ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. అలాగే కార్మిక వర్గంపై లేబర్ కోడ్స్ పేరుతో జరగబోతున్న దాడిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఐఎఫ్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పాలారి రాష్ట్ర కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టగా సభ్యులు చర్చించి ఆమోదించారు. ఈ ఐఎఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు బి.సురేష్, ఎం.ఏసు, స్థానిక నాయకులు చిన్నా, తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఐఎఫ్‌టియు జాతీయ ఉపాధ్యక్షులు పి.ప్రసాద్










