గుంతకల్లు : సమస్యల పరిష్కారం కోరుతూ శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న శ్రీరామరెడ్డి తాగునీటి పతకం కార్మికులపై ఉరవకొండ సిఐ అకారణంగా దుర్భాషలాడి దాడి చేయడం హేయమని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు పేర్కొన్నారు. తక్షణం సిఐను సస్పెండ్ చేసి, ఆయనపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంతకల్లు డీఎస్పీ నరసింగప్పను మంగళవారం కలసి వినతపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ శ్రీరామిరెడ్డి నీటిని సరఫరా చేసే కార్మికులు వారి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా సమ్మె చేస్తున్నారని చెప్పారు. ఈనెల 19వ తేదీ రాత్రి ఉరవకొండ సిఐ హరినాథ్ యూనియన్ నాయకులపై అకారణంగా దాడిచేసి, నానా దుర్భాషలాడారని చెప్పారు. కార్మికులకు బకాయి వేతనాలు, పిఎఫ్, ఇఎస్‌ఐ చెల్లించాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, ఎస్‌ఆర్‌ఇన్‌ఫ్రా కాంట్రాక్టర్‌కు అనేక సార్లు విజ్ఞప్తులు చేశారన్నారు. ఏళ్ల తరబడి ఆ సమస్యలు పరిష్కారం కాని నేపథ్యంలో కార్మికులు సమ్మెనోటీసు ఇచ్చి మార్చి 19 నుంచి నిరవధిక సమ్మెలోక వెళ్లారన్నారు. 20వ తేదీ రాత్రి పిఎబిఆర్ డ్వామా 11 గంటల సమయంలో ఉరవకొండ సిఐ హరినాథ్ యూనియన్ నాయకులు ఎర్రిస్వామి, సంజప్ప, గంగాధర్, ఆనంద్‌లను పిలిపించి 'సమ్మెచేయడానికి మీరెవర్రా.. మీకేమి అధికారం ఉంది' అంటూ నానా దుర్భాషలాడి దాడి చేశారన్నారు. అంతటితో ఆగకుండా వారిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి బలవంతంగా తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారని తెలిపారు. ఈ విషయాలు బయటకు చెబితే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామని భయపెట్టారన్నారు. సమ్మె చేయడం కార్మికుల హక్కు అన్న విషయం సిఐకు తెలియకపోవడం విచారకరం అన్నారు. ఫ్రెండ్లీ పోలీసు అంటూ ఇలా బెదిరింపులకు దిగడం పోలీసు శాఖకే మాయని మచ్చ అన్నారు. కార్మికులపై దౌర్జన్యం చేసి, బెదిరింపులకు దిగిన సిఐను వెంటన సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.నాగరాజు, ఉపాధ్యక్షులు సి.రమేష్, కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.రంగారెడ్డి, ఎంఎటియు ఆర్గనైజర్ ఎం.నాగరాజు, శ్రీరామరెడ్డి తాగునీటి పథకం యూనియన్ అధ్యక్షుడు బి.నాగరాజు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.రామాంజనేయులు, సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు, రైతు సంఘం కార్యదర్శి దాసరి శ్రీనివాసులు, సంచార జాతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వై.శ్రీనివాసులు, కెవిపిఎస్ డివిజన్ కార్యదర్శి జగ్గలి రమేష్, సిఐటియు నాయకులు తిమ్మప్ప పాల్గొన్నారు.










