Aug 26,2022 23:44

కార్మిక సంఘాల నిరసనలు

కార్మిక సంఘాల నిరసనలు
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌

కార్మికులకు నష్టం చేకూర్చే లేబర్‌ కోడ్‌లను అమల్లోకి తెస్తూ, అప్రజాస్వామికంగా కార్మికసంఘాల పట్ల వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు జరిగాయి. రాష్ట్ర నేతలని చూడకుండా బలవంతంగా రోడ్లపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లడాన్ని ఖండించారు. చిత్తూరు కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం ధర్నా జరిగింది. ఈ ధర్నా ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వాడా గంగరాజు, పి.చైతన్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో పాస్‌ చేసిన లేబర్‌కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు గత రెండు సంవత్సరాల నుండి డిమాండ్‌ చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశాల్లో కార్మిక వ్యతిరేక అంశాలను తొలగించమని కోరినా లెక్క చేయకుండా వాటి అమలు కోసం ముందుకు పోతోందన్నారు. ఆగస్టు 25, 26 తేదీల్లో తిరుపతిలో రాష్ట్రాల కార్మిక మంత్రులు, లేబర్‌ కమిషనర్లతో మోడీ ప్రభుత్వం లేబర్‌కోడ్ల అమలును వేగవంతం చేసేందుకు సమావేశం నిర్వహించిందన్నారు. ప్రధాని మోడీ ఈ సమావేశాన్ని ప్రారంభించారని, సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌ (అందరితో ఉంటాం, అందరి అభివద్ధి కోసం పనిచేస్తాం) అని నినాదం ఇచ్చే మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్‌ కంపెనీలకు, యజమానులకు అనుకూలంగా తయారైన లేబర్‌ కోడ్లను అమలు చేయించాలని తహతహ లాడారన్నారు. నోటీసులివ్వకుండా సమ్మె చేసే హక్కు కోల్పోవడమే కాకుండా లేబర్‌ అధికారులు సమ్మె నోటీసు ఆధారంగా కన్సిలియేషన్‌ (మధ్యవర్తిత్వం) సమావేశం నిర్వహించడం మొదలు పెట్టగానే కార్మికులు సమ్మెకు వెళ్లే హక్కును కోల్పోతారన్నారు. లేబర్‌ అధికారులు యజమానులకు అనుకూలంగా కన్సిలియేషన్‌ సమావేశాలను పదే పదే వాయిదా వేస్తూ వాటిని సజీవంగా ఉంచుతారన్నారు. కార్మికుల తొలగింపులు, ఓవర్‌టైమ్‌, మూసివేతలు, లే-ఆఫ్‌లను పారిశ్రామిక సంబంధాల కోడ్‌ సులభతరం చేసిందనానరు. ఈ ధర్నా లో ఏఐసిసిటియు కన్వీనర్‌ గంగాధర్‌ గణపతి, సిఐటియు జిల్లా నాయకులు గోవిందప్ప, రామకష్ణ, పొన్నుస్వొమిలతో పాటు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ఎఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శులు సత్యమూర్తి, విజరుకుమార్‌ ఆధ్వర్యంలో నిరసన జరగింది. ఈ కార్యక్రమంలో గోపీనాధ్‌, రమాదేవి, మనీగిడ్డు బారు, బాలాజీ, చంద్రయ్య పాల్గొన్నారు.