ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ కార్మిక హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోరుతూ ఆదివారం నిర్వహించనున్న మేడే కార్మిక దీక్షాదినాన్ని కార్మికులందరూ జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.నాగమణి, ఎస్.నాగేంద్రకుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ మేడే 137వ కార్మిక దినోత్సవాన్ని పురష్కరించుకుని సిఐటియు ఆధ్వర్యంలో నేడు నగరంలో గొప్ప కార్మిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కృష్ణ కళామందిర్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లావ్యాప్తంగా సిఐటియు జెండాలు ఎగురవేసి ర్యాలీలు, సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా 1886 అమెరికా చికాగో నగరం హే మార్కెట్ వద్ద జరిగిన పోరాటంతోనే 8 గంటల పని దినం సాధ్యమైందని తెలిపారు. ఈ పోరాటంలో మృతి చెందిన కార్మికులందరికీ ముందుగా నివాళులర్పించనున్నట్లు తెలిపారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక విధానాలను ఎండగట్టేందుకు సంసిద్ధం కావడానికి మేడేలో ప్రతిజ్ఞ చేద్దామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు, కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ ప్రభుత్వాలను నిలదీసి హక్కులు సాధించుకోవడానికి ఐక్య పోరాటాలు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి గోపాల్, అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమాదేవి, శకుంతల, సిఐటియు నగర కార్యదర్శులు వెంకటనారాయణ, ముర్తుజా, మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.నాగభూషణం, జిల్లా అధ్యక్షులు ఎటిఎం.నాగరాజు, సభ్యులు శ్రీనివాసులు, భవన నిర్మాణ సంఘం జిల్లా కార్యదర్శి మన్నీల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నాగమణి, ఎస్.నాగేంద్రకుమార్










