Oct 07,2023 19:35

పాదయాత్రలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి -పొదలకూరు : జిల్లాలోని వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులందరికీ కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. మోహన్‌ రావు డిమాండ్‌ చేశారు. నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధి కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మండలంలోని విరువూరులో శుక్రవారం ప్రారంభమైన పాదయాత్ర శనివారం రెండో రోజు పొదలకూరు పట్టణంలో సాగింది. ఈ పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ పాదయాత్ర సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు, మనుబోలు, వెంకటాచలం, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు మండలాల్లో జరుగుతుందన్నారు. ఈనెల 13న నెల్లూరు నర్తకి సెంటర్లో జరిగే బహిరంగ సభ వద్దకు పాదయాత్ర చేరుకుంటుందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కష్ణపట్నం పోర్టు, ధర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు, పామాయిల్‌ ఫ్యాక్టరీతో పాటు పరిశ్రమలు ఉన్నాయన్నారు. వీటి నుంచి వచ్చే కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఉన్న ఏకైక ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏపీ జెన్కో ఆధ్వర్యంలో ఉందని, దీని ప్రయి వేటీకరణకు క్యాబినెట్లో తీర్మానం చేశారని చెప్పారు. సంవత్సరకాలం గా తమ పోరాట ఫలితంగా ప్రస్తుతం ఆప్రక్రియ ఆగిందని తెలిపారు. ప్రయి వేటీకరణ జిఒను శాశ్వతంగా రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ నాయకులు గోగుల శ్రీనివాసులు, అల్లాడి గోపాల్‌, ఆలూరి తిరుపాలు, టీవీ ప్రసాద్‌, పొదలకూరు మండల ఇన్చార్జి కే. పెంచల నరసయ్య, గడ్డం అంకయ్య, కిన్నెర కుమార్‌, సిపిఎం మండల కార్యదర్శి బి. మనోహర్‌, డివైఎఫ్‌ఐ నెల్లూరు రూరల్‌ అధ్యక్షులు వంకదారి శ్రీనివాసులు, మండల సిపిఎం నాయకులు గుడిమణి, వెంకటేశ్వర్లు, దాసు ఉన్నారు.