Oct 06,2023 21:13

ఫొటో : మాట్లాడుతున్న ఎపిఎస్‌ ఆర్‌టిసి బోర్డు డైరెక్టర్‌ ఏ.రాజారెడ్డి

కార్గో అభివృద్ధికి సమిష్టి కృషి చేయాలి
ప్రజాశక్తి-కావలి : కార్గో విభాగం ఆదాయం పెంచేందుకు ఆర్‌టిసి అధికారులు, సిబ్బంది సమిష్టి కృషిచేయాలని ఎపిఎస్‌ ఆర్‌టిసి బోర్డు డైరెక్టర్‌ ఏ.రాజారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం అయన ఆధ్వర్యంలో కార్గో అభివృద్ధి కమిటీ కావలి డిపోను సందర్శించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి 51,488 మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు చేసినందున వారి జీతాలు సకాలంలో ప్రభుత్వ ఖజానా నుండి చెల్లిస్తున్నట్లు తెలిపారు. బస్సులు నడపడడం ద్వారా వచ్చిన ఆదాయంతో రూ.2500 కోట్లు ఆర్‌టిసి అప్పులు తీర్చబడ్డాయన్నారు. కార్గో విభాగం తదితర వాణిజ్య ఆదాయం ద్వారా వచ్చే మొత్తం కార్మికుల సంక్షేమానికి వినియోగిస్తున్నామన్నారు.
సరుకు రవాణా ద్వారా ఈ ఆర్థిక సంవత్సర అంతానికి రూ.250 కోట్లు వస్తుందని, 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం రూ.1000 కోట్లకు పెంచేందుకు కార్గో అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి అన్నీ జిల్లాలు పర్యటించి అక్కడ వినియోగదారులు, సిబ్బంది సలహాలు తీసుకుంటున్నామన్నారు. కావలి డిపో కార్గో విభాగం పనితీరు బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. కావలి వస్త్ర వ్యాపారుల కోరిక మేరకు త్వరలోనే టుపే చెల్లింపులు పునప్రారంభిస్తామన్నారు. ఆర్‌టిసి ఉద్యోగులందరూ వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞత కలిగి ఉండాలన్నారు. ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆర్‌టిసి (ప్రజా రవాణా)కు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ రూ.9678 కోట్లు కేటాయించి, సామాన్య ప్రయాణికుడు కూడా విలాసవంతమైన, సురక్షితమైన ప్రయాణం అనుభవించాలనే ఉద్దేశంతో డిజిల్‌ బస్సుల స్థానంలో దశలవారీగా ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ఎన్నడూ లేనివిధంగా ఆర్‌టిసి సిబ్బందికి మెరుగైన పెన్షన్‌ అందించనున్నారన్నారు. చనిపోయిన ఉద్యోగుల భార్య, పిల్లలకు ఆర్‌టిసి సంస్థలో ఖాళీ లేనందున ప్రభుత్వ విభాగాలలో సచివాలయంలో కారుణ్య నియామకాలు చేపట్టి, దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారని డైరెక్టర్‌ రాజారెడ్డి పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోలో పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ప్రతి రవాణా వ్యవస్థ ఉచిత ప్రయాణ హామీలతో ఆర్‌టిసి ప్రగతి చక్రం తిరిగి తిరోగమనంలోకి వెళ్లే అవకాశం ఉందని వివరించారు. ప్రభుత్వ మన్ననలు, ప్రయాణికుల ఆదరాభిమానాలు పొందే విధంగా సంస్థ ఉద్యోగులు కృషి చేయాలని ఆర్‌టిసి బోర్డు డైరెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్గో అభివృద్ధి కమిటీ సభ్యులు గుంటూరు జిల్లా ఎటిఎం (కమర్షియల్‌) సురేష్‌ కుమార్‌, ఎఎం (పర్సనల్‌) రాజశేఖర్‌, కావలి డిపో మేనేజర్‌ రాపూరు శ్రీనివాసులు, అసిస్టెంట్‌ మేనేజర్‌ (ట్రాఫిక్‌) కెవిఆర్‌ బాబు, డిపో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ డి.రవిప్రకాష్‌, వైఎస్‌ఆర్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ నాయకులు పి.ఆర్‌.ఖాన్‌, పి.జనార్దన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.