Aug 07,2023 21:51

వేదవతి నది వద్ద సెల్ఫీ దిగుతుతున్న మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు

        ప్రజాశక్తి-రాయదుర్గం    దశాబ్దాల కాలంగా నీటి జాడలెరుగని వేదవతి, హగరికి జలకళ తెప్పించేందుకు తాను కృషి చేస్తే, అదే నది నుంచి ఇసుకను తోడేస్తూ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రూ. కోట్లు దండుకుంటున్నాడని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. సెల్ఫీ ఛాలెంజ్‌లో భాగంగా టిడిపి హయాంలో మండల పరిధిలోని మల్కాపురం సమీపంలో వేదవతి(హగరి)లో నిర్మించిన సబ్‌ సర్ఫేస్‌ డ్యాం వద్ద సోమవారం కాలవ 17వ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. వర్షాభావ పరిస్థితులకు తోడు కర్నాటకలో నదికి అడ్డంగా చెక్‌ డ్యాంలు నిర్మించడం వల్ల హగరిలో నీటి జాడలు కరువయ్యాయన్నారు. అలాంటి నదికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు టిడిపి పాలనలో సబ్‌ సర్ఫేస్‌ డ్యాంలు నిర్మించాలనే బృహత్‌ ప్రయత్నం చేశామన్నారు. మల్కాపురం సమీపంలో నది గర్భంలో అలాంటి కట్టడాన్ని నిర్మించామన్నారు. ఈ డ్యాం వల్ల నదిలో నీరు పారినప్పుడు, భాగర్భంలో నీళ్లు ఇంకి రైతు బోర్లు రీఛార్జీ అవుతాయన్నారు. వేదవతికి తిరిగి జీవం పొసే ఈ మహత్తర కార్యాన్ని వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన రాజేంద్రసింగ్‌ చేతుల మీదుగా ప్రారంభించామన్నారు. నాలుగేళ్లలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హగరి నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తూ రూ. కోట్లు గడించారని ఆరోపించా రు. రైతుల సంక్షేమం, నదులను బతికించాలనే సంకల్పం టిడిపిదైతే, కాపు నదిని అవినీతి, అక్రమాలకు అడ్డాగా మార్చుకొని సహజ వనరులను దోపిడీ చేశారని దుయ్యబట్టారు. ప్రజలు, రైతులకు ఉపయోగపడే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఒక్కటైనా చేశావా అని ''కాపు''ను కాలవ నిలదీశారు.