అనంతపురం కలెక్టరేట్ : ఉమ్మడి అనంతపురం జిల్లాలో నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరాలో పని చేస్తున్న కార్మికులకు ఎస్‌ఎస్‌ఆర్ రేట్లతో చెల్లించాల్సిన వేతనాల్లో కోతలు విధించి కాజేసిన కాంట్రాక్టర్ కలాం నాయుడుపై చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు, అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నాడు అనంతపురం కృష్ణకళామందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం స్పందనలో కలెక్టర్ ఎమ్.గౌతమిని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. శ్రీరామ్‌రెడ్డి కార్మికులు మడకశిర డివిజన్‌లో వేతనాలు బకాయి పడ్డాయని తెలిపారు. పైగా ఒక్కొక్క కార్మికుని వేతనంలో రూ.2500 చొప్పున 120 మంది కార్మికుల డబ్బులు కోతలు విధించి కాజేశాడన్నారు. 120 మంది బోగస్ పేర్లతో కార్మికులుగా చూపించి ఒక్కొక్కరి పేరుతో నెలకు రూ.15 వేల చొప్పున వేతనాలు చెల్లించినట్లు చూపించి దండుకున్నాడని తెలిపారు. రెండు సంవత్సరాలుగా సుమారు రూ.6.50 కోట్లు కాజేశాడన్నారు. కాంట్రాక్టర్ అవినీతికి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సహకరించారని తెలిపారు. అలాంటి అధికారులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. బకాయి పడ్డ వేతనాలు, ఇఎస్‌ఐ, పిఎఫ్ డబ్బులు చెల్లించాలని కోరారు.










