Apr 25,2023 21:09

ఎపి జెఎసి అమరావతి జిల్లా ఛైర్మన్‌ శివశంకర్‌
కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల ధర్నా
ప్రజాశక్తి - భీమవరం
ఎన్నోఏళ్ల నుంచి ఎటువంటి భద్రతా లేకుండా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎపి జెఎసి అమరావతి జిల్లా ఛైర్మన్‌ ఎస్‌.శివశంకర్‌ డిమాండ్‌ చేశారు. ఎపి జెఎసి అమరావతి రెండోదశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా కలెక్టరేట్‌ వద్ద కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శివశంకర్‌ మాట్లాడుతూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పథకాలు, రాయితీలు పునరుద్ధరించాలని కోరారు. జిఒ నెం.25ను ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. బదిలీల సౌకర్యంతోపాటు వార్షిక ఇంక్రిమెంటు ఇవ్వాలి కోరారు. సీనియార్టీ ప్రాతిపదికన వేతనాలు ఇవ్వాలని , రెగ్యులర్‌ ఉద్యోగ నియామకాల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇహెచ్‌ఎస్‌ సౌకర్యం కల్పించాలని, సాధారణ, మెడికల్‌ లీవుల సౌకర్యం కల్పించాలని, అర్హత, సీనియార్టీని బట్టి ఉద్యోగోన్నతులు కల్పించాలని నినదించారు. కార్యక్రమంలో ఎపి జెఎసి అమరావతి రాష్ట్ర అర్గనైజింగ్‌ కార్యదర్శి ఎస్‌.కృష్ణమోహన్‌, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు జి.జేమ్స్‌ గాబ్రియేలు, ఎపి జెఎసి అమరావతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఫణి, ఆర్‌టిసి యూనియన్‌ నాయకులు ఎ.సత్యనారాయణ, ఎపిఆర్‌ఎస్‌ఎ జిల్లా కార్యదర్శి ప్రసాదరాజు, కలెక్టరేట్‌ సీనియర్‌ సహాయకులు వివి.పెద్దిరాజు, పి.జగన్మోహన్‌, సిబ్బంది, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ మెడికల్‌ నాయకులు ఎన్‌.ప్రకాష్‌బాబు, వై.మోహన్‌, పంచాయతీరాజ్‌ శాఖ నాయకులు పి.శ్వేత, పబ్లిక్‌ హెల్త్‌ నాయకులు జి.మంగరావు, కె.ఏసు, ఎన్‌.విశ్వనాధ్‌, ఆర్‌.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.