Oct 14,2023 22:35

మాట్లాడుతున్న అంబటి కృష్ణారావు

శ్రీకాకుళం అర్బన్‌ : కేంద్రంలో తిరిగి కాంగ్రెస్‌ పార్టీ అధికా రంలోకి వస్తే తప్ప విభజన చట్టంలోని హామీలు నెరవేరవని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపికి 22 మంది ఎంపిలున్నా బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం చేయలేక వారివద్ద మోకరిల్లుతున్నారని పిసిసి సహాయ కార్యదర్శి అంబటి కృష్ణారావు విమర్శించారు. శనివారం నగరంలోని ఇందిరా విజ్ఞాన్‌భవన్‌లో విలేకర్లతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం రావడానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. విభజన తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సిన విభజన హామీలేవీ నెరవేర్చలేదన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మి ప్రజలను ఆస్తులను అప్పనంగా కట్టబెట్టే పనిలో బిజెపి పెద్దలు నిమగమై ఉన్నారన్నారు. కక్షసాధింపు, మత చాందసవాదం, కులాల, మతవిధ్వేసాలు రెచ్చ గొట్టడంతో పబ్బం గడుపుతున్నారన్నారు. భారత్‌ జోడో యాత్రలో ఎపికి ప్రత్యేక హోదా కల్పిస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు దేశల్ల మల్లిబాబు, రెల్ల సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.