Apr 29,2023 21:00

స్వామివారి కళ్యాణోత్సవాలు ప్రారంభం
ప్రజాశక్తి - కాళ్ల
జిల్లాలోని ప్రముఖ క్షేత్రమైన కాళ్లకూరు వెంకటేశ్వరస్వామి కళ్యాణో త్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. యాత్రికులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా వైశాఖ శుద్ధ నవమి పూజలు, మత్స గ్రహణం, అంకురార్పణ, ధ్వజారోహణ సేవలు నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవాలకు వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. దేవస్థానం ఛైౖర్మన్‌ దండు వెంకట కృష్ణంరాజు, ఆలయ ఇఒ ఎం.అరుణ్‌ కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఆలయ ప్రాంగణం చుట్టూ చలువ పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. మే 1వ తేదీ సోమవారం స్వామివారి కళ్యాణం ఛైర్మన్‌ దండు వెంకట కృష్ణంరాజు, స్రవంతి దంపతులతో జరుగుతుందన్నారు. మే 2న మల్లెపూలతో విశేష అర్చన, కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు, 3న లిల్లీపుష్పాలతో విశేషార్చన, 4న కనకాంబర పుష్పాలతో, 5న రజిత పుష్పాలతో విశేషార్చన, స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహిస్తామన్నారు. 6న చక్రస్నానం, 7న గులాబీలతో విశేషార్చన నిర్వహిస్తామన్నారు. 13న అఖండ అన్నసమారాధన జరుగుతుందని ఆలయ ఛైర్మన్‌ దండు వెంకట కృష్ణంరాజు, ఆలయ ఇఒ ఎం.అరుణ్‌ కుమార్‌ తెలిపారు.