అనంతపురం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న కొద్దీ అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిల మధ్య మాటల యుద్ధమే కాకుండా సెల్ఫీ ఛాలెంజ్‌లు పెరిగాయి. ఈ రెండింటితో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ఆయా నియోజకవర్గంలో పర్యటించినప్పుడు కొన్ని సమస్యలపై సెల్ఫీ ఛాలెంజ్‌ల పేరుతో ఫొటోలు దిగి పెట్టారు. ఆయన పాదయాత్ర జిల్లాలో ముగిసిన తరువాత ఇప్పుడు జిల్లా తెలుగుదేశం నాయకులు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. నాలుగేళ్లలో వైసిపి చేపట్టలేని పనులను ఎత్తి చూపుతూ ఆయా పనుల వద్దకెళ్లి సెల్పీలు దిగి పోటోలు పెడుతున్నారు. అదే సమయంలో వారు అధికారంలోనున్న సమయంలో 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి లెక్కలను చెబుతున్నారు. ఇది రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాయదుర్గంలో గుమ్మగట్ట వద్ద సంక్షేమ వసతి భవన నిర్మాణం పూర్తవకపోవడాన్ని ఎత్తి చూపుతూ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు సెల్పీ దిగి పెట్టారు. అంతే కాకుండా ప్రతి సోమవారం ఒక సెల్పీ ఛాలెంజ్‌ను విరుసుతున్నట్టు చెబుతున్నారు. ఆయన హయంలో ఏమి చేపట్టార్న దానిపై వివరాలు వెల్లడిస్తున్నారు. దీనికి ప్రతిగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ప్రతి స్పందించారు. దీంతో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వివాదం తీవ్ర స్థాయిలోనే గురువారం చోటు చేసుకుంది. సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య పోలీసులు జోక్యం చేసుకుని సర్ధిజెప్పారు. అదే సమయంలో అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తమ హయంలో నిర్మంచ తలపెట్టిన టిడ్కో ఇళ్లు నాలుగేళ్లు అయినా పూర్తవకుండా ఉన్నాయంటూ ఆయన కూడా టిడ్కో ఇళ్ల వద్దకెళ్లి సెల్పీ ఛాలెంజ్ విసిరారు. దీనికి అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కూడా ప్రతి స్పందించారు. వారి హయంలో గ్రూపు తగాదాలతోనే సరిపోయిందని, తాము అధికారంలోకి వచ్చాకనే అనంతపురం నగరంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెబుతున్నారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రాప్తాడులోనూ మాజీ మంత్రి పరిటాల సునీత శుక్రవారం నాడు సెల్పీ ఛాలెంజ్ విసిరారు. జీడిపల్లి నుంచి పేరూరుకు ఎత్తిపోతల పథకాన్ని తమ హయంలో ప్రారంభించి 30 శాతం పూర్తి చేసినట్టు కాలువలను చూపించారు. ఒక్క రిజర్వాయర్ కాదు మూడు రిజరాయర్లు కడతామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక శంకుస్థాపనలు చేసారని గుర్తు చేశారు. అయితే అవి ఒక్కడుగు ముందుకు కదల్లేదని విమర్శలు చేశారు. అదే సమయంలో తమ హయంలో రామగిరి మండలంలో నిర్మించిన బాలికల వసతి గృహం ముందు నిలబడి సెల్పీ ఛాలెంజ్ అని పోటోలు పెట్టారు. ఇదే తరహాలో తాడిపత్రిలోనూ ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని, వీటిని అడ్డుకుంటామిని జెసి.ప్రభాకర్‌రెడ్డి చెబుతుండగా, అడ్డుకుని చూడమని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఛాలెంజ్ చేస్తున్నారు. వీరే కాకుండి ఇతర టిడిపి నాయకులు కూడా ఇదే తరహాలో తమ ప్రాంతంలో ఆగిపోయిన పనులకు సంబంధించి సెల్ఫీలు దిగి ఫోటోలు విడుదల చేస్తున్నారు. శింగనమల నియోజకవర్గం పరిధిలో గార్లదిన్నె మండల కేంద్రంలో ఆగిన ఇండోర్ స్టేడియం ముందు నిలబడి టూమెన్ కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఇలా అనేక చోట్ల టిడిపి నాయకులు ఆగిన అభివృద్ధి పనులను ఎత్తి చూపుతూ సెల్ఫీ ఛాలండెజ్‌లు విసురుతున్నారు.










