Nov 18,2022 15:42

ప్రజాశక్తి-వెదురుకుప్పం : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి సైన్స్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతుల ప్రధానం చేశారు. గత మాసంలో 28వ తేదీన పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం పొందిన 8,9,10వ విద్యార్థినీ విద్యార్థులకు మండల స్థాయి పోటీలు నిర్వహించడమైనది. పిల్లలలో సైన్స్ పట్ల అవగాహన కల్పించడం ద్వారా అజ్ఞానం మూఢనమ్మకాలు దురాచారాల పట్ల విముఖత కలిగే విధంగా సైన్స్ ను అభివృద్ధి చేయడం జన విజ్ఞాన వేదిక ప్రధాన ఉద్దేశం అని ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ రెడ్డి గారు తెలిపారు. ఈ పోటీల్లో ఆళ్ళమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కె. ప్రేమ కుమార్,కె.యశ్వంత్ కృష్ణ, ఎ.విష్ణుప్రభ ప్రథమ స్థానంలో నిలిచారు. పచ్చికాపలం శ్రీ వివేకానంద హై స్కూల్ పిల్లలు కూడా విజయం సాధించారు. జిల్లాస్థాయిలో జరిగే చెకుముకి పోటీలలో వీరు పాల్గొనవలసి ఉన్నది. మండల స్థాయిలో పాల్గొన్న విద్యార్థులకు, విజేతలకు పాతగుంట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి చాముండేశ్వరి సర్టిఫికెట్స్, మెడల్స్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ మరియు మండలంలోని సైన్సు ఉపాధ్యాయులు శ్యామల, భూపతి, రమేష్ ఉపాధ్యాయులు మురళిరెడ్డి, ఉమామహేశ్వర్, జోష్ణ, మునిరత్నం ఈశ్వరయ్య, డాక్టర్ బండి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.